గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
జూన్ 11 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
దిశ, మెదక్ ప్రతినిధి : జూన్ 11 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 అక్టోబర్ 16 న జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో టీ.ఎస్.పీ.ఎస్.సీ జిల్లాకు 3,293 మంది అభ్యర్థులు కేటాయించగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి పరీక్షలు సాఫీగా నిర్వహించామన్నారు. అదేవిధంగా వచ్చే జూన్ 11 న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు 3,960 అభ్యర్థులను జిల్లాకు కేటాయించే అవకాశమున్నందున పరీక్షకు మౌలిక వసతులున్న కేంద్రాలను గుర్తించి, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు.
బఫర్ గా 20 శాతం ఇన్విజిలేటర్లను అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఎంపిక చేసిన కేంద్రాల్లో భవన లీకేజీలు ఏమైనా ఉంటే ముందే గుర్తించి తగు మరమ్మతులు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించాలని, ప్రతి కేంద్రంలో డ్యూయల్ డెస్క్ లు ఉండేలా చూడాలన్నారు. నిరంతర విద్యుత్, మంచి నీటి సౌకర్యం ఉండేలా తహసీల్దార్లు ప్రతి గదిని పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించబడవని, అభ్యర్థులు కానీ, సిబ్బంది కానీ తమ వెంట తీసుకురావొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు సాయిరాం, శ్యామ్ ప్రకాష్, డీఈవో రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, ఆంజనేయులు, జ్ఞాన జ్యోతి, కలెక్టరేట్ ఏవో యూనుస్, తదితరులు పాల్గొన్నారు.