ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు
ఐటీ ఇండస్ట్రీ కంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు అన్నారు.
దిశ, నర్సాపూర్: ఐటీ ఇండస్ట్రీ కంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని శ్రీ విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహన పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన విద్యుత్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలో ఇలాంటి విద్యుత్ వాహన పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి పోటీల వల్ల పిల్లలకు టెస్ట్ బుక్ నాలెడ్జితో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని అన్నారు. విద్యార్థులకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ పైన ఆసక్తి పెంచడానికి గత 15 సంవత్సరాల నుంచి సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్ వారు పోటీలు నిర్వహిస్తున్నారని, ఈసారి సౌత్ ఇండియా తెలంగాణలోని నర్సాపూర్ లో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
వచ్చే ఏడాది సైతం నిర్వహించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యుత్ వాహన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 75 టీంలు 2000 పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. దేశానికి ఇంజనీర్స్ ఎంతో అవసరం అని దేశంలో వాహనాల ప్రొడక్షన్ చాలా పెరిగిందని అన్నారు. అయితే మహారాష్ట్ర నుంచి 25 టీంలు కర్ణాటక నుంచి పది టీంలు ఏపీ తెలంగాణ నుంచి కేవలం ఒక్కొక్కటి మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సరిపోదని ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఆర్సిపూర్ చెరువు పక్కన నిర్వహించే ఎన్ డ్యూ రెన్స్ పోటీలకు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఎండ్యూరెన్స్ పోటీలలో క్వాలిఫై అయిన విద్యార్థులకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఇలాంటి పోటీలు తమ కళాశాలలో నిర్వహించడం సంతోషకరమని ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇష్టం విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపల్ సంజయ్ దుబే, డీన్ బాపిరాజు, మేనేజర్ అశోక్ రెడ్డి ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు.