ఏడుపాయల జాతరకు 157 స్పెషల్ బస్సులు : మెదక్ ఆర్టీసీ డిపో డీఎం
మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల జాతర కోసం 157 బస్సు సర్వీసులను వినియోగించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుధ తెలిపారు.
దిశ కొల్చారం: మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల జాతర కోసం 157 బస్సు సర్వీసులను వినియోగించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుధ తెలిపారు. గురువారం ఏడుపాయల జాతర కొల్చారం మండలం టేకుల గడ్డ వద్ద ఏర్పాటు చేయనున్న బస్టాండ్‌లో ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జాతరలో 118 సర్వీసులు నడపగా ఈసారి మహిళ జ్యోతి ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా మహిళలు జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున 157 సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.
మెదక్ సంగారెడ్డి పటాన్ చెరు నారాయణఖేడ్ జహీరాబాద్ సికింద్రాబాద్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి ప్రతి 15 నిమిషాలకు బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే బస్సు ప్రయాణికుల కోసం బస్టాండ్ నుంచి ఆలయం వరకు 8 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు. జాతరలో సుమారు 80 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల సేవ కోసం 24 గంటలు పని చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అమర్ సింగ్ రాథోడ్ సివిల్ డీఈ ఈ మనోహర్ రావు, తదితరులు పాల్గొన్నారు.