Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది గ్రామస్థాయి నాయకుల కృషి ఫలితమేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. శుక్రవారం పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని బిల్లులు ఇవ్వకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, వ్యక్తుల ప్రభావం అధికంగా ఉండే పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలవాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ సంఘటన్ కు చాలా ప్రాముఖ్యత ఉందని సంస్థ ఇంకా బలోపేతం చెయ్యాలన్నారు. సేవాదల్, ఆర్జీపీఆర్ఎస్ లు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చాలా ఇష్టం అన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణతోనే గ్రామాలకు హక్కులు వచ్చాయని ఇది రాజీవ్ గాంధీ కృషి అని చెప్పారు.
కేసీఆర్ కు అవకాశమిస్తే మోసం చేశారు:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు జనం కేసీఆర్ కు సీఎంగా అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ పేరుతో ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. కేసీఆర్ (KCR) కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు చేశారని కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రైతు రుణ మాఫీ, రైతు బంధు, బోనస్, యువతకు ఉద్యోగాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నిజమైన పేదవాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందించినప్పుడే మన లక్ష్యం నెరవేరుతుందన్నారు.
మోడీకి ఫోటోల పిచ్చి:
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ఫొటోల పిచ్చి అని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బడా బాబులు, ధనవంతుల కోసమే బీజేపీ పని చేస్తుందని విమర్శించారు. కులగణన ఇది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. దీని వల్ల పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కులగణన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించడం హర్షనీయమన్నారు. రాజీవ్, రాహుల్, సోనియాగాంధీలకు పదవుల మీద ఆశ లేదన్నారు. బీజేపీ కేంద్రంలో ఇచ్చిన ఒక్క హామీ నెర వేర్చలేదని, ఈ దేశాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే బీజేపీ అమ్మేస్తుందన్నారు.