బీఆర్ఎస్కు మహారాష్ట్ర పోలీసుల షాక్!
బీఆర్ఎస్కు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. మహారాష్ట్ర పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ గత కొంత కాలంగా ఆ రాష్ట్రంలో వరుసగా భారీ బహిరంగ సభలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్కు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. మహారాష్ట్ర పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ గత కొంత కాలంగా ఆ రాష్ట్రంలో వరుసగా భారీ బహిరంగ సభలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 18న లేదా24వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) లో మరో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంతలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్ మైదానంలో మీటింగ్ కు అనుమతి ఇవ్వడం సాధ్యపడదని పోలీసులు తేల్చి చెప్పారు. మరో ప్రదేశాంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో నగరంలోని మిలింద్ కాలేజీకి దగ్గర్లో మీటింగ్ పెట్టుకోవాలని పోలీసులు చేసిన సూచనను సీఎం కేసీఆర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్న కేసీఆర్ ఆ రాష్ట్రంలో తరచూ పర్యటిస్తూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. పలువురు మహారాష్ట్ర నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్న కేసీఆర్ కు ఔరంగాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.