జల్సాల మత్తులో యువత చిత్తు...

జిల్లాలో యువత చెడుదారుల్లో వెళుతూ వారి బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు.

Update: 2024-11-17 03:13 GMT

దిశ, గద్వాల : జిల్లాలో యువత చెడుదారుల్లో వెళుతూ వారి బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి విచ్చల విడిగా అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరూ చూడని ఆన్లైన్ గేమింగ్ యాప్ లకు అలవాటు పడి నిత్యం వారి బ్యాంకు బ్యాలెన్స్ జీరో చేసుకుంటున్నారు. దీంతో ఎప్పుడైనా లక్కు కాలిసిరాకపోతుందా అనుకుంటూ తల్లితండ్రుల పాకెట్ మనీతో కాలనీలలో పరిచయాలు ఉన్న అందరితో ఒకరికి తెలియకుండా మరొకరితో మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీ వరకు లక్షల్లో అప్పులు చేసి మరి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను పీల్చి మరీ ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నారని, జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిత్యం ఇదే తంతు కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న దొంగతనాలు..

జిల్లాలో నిత్యం జరుగుతున్న దొంగతనాల విషయంలో కూడా యువత ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్, గంజాయి మత్తులో జేబులు గుల్ల అవుతుండటంతో దొంగతనాల వైపు యువత ఎక్కువగా అలవాటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారికి తల్లితండ్రులతో పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వకుంటే మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందనే చర్చ జిల్లాలో బలంగా వినిపిస్తోంది.

పోలీసులవైపు చూస్తున్న బాధితులు..

మరోవైపు తల్లితండ్రులకు తెలియకుండా ఇంటిచుట్టూ పక్కల వారితో అప్పులు చేసి జల్సాల మాయలో పడిన యువత నెలలు గడిచినా తీసుకున్న అపు వారికి తిరిగి ఇవ్వలేక పోతున్నారు. ఒక్కొక్కరి దగ్గర సుమారు రూ.50 వేల నుంచి రూ.5లక్షల వరకు అప్పు చేసి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది. బాధితులు తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బును తెలిసిన వాళ్ళే కదా డబ్బులున్న వాళ్ళే కదా అని ఇస్తే ఇలా మొదటికే మోసం చేస్తే ఎలా అని తల్లిదండ్రులను అడుగుతున్నారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. నిర్ణీత గడువు ఇచ్చినట్లయితే కొడుకులు చేసిన అప్పులను కొందరు తీరుస్తామని కొంతమంది యువత కుటుంబ సభ్యులు అంటున్నారని, మరికొందరు ఎవరిని అడిగి అప్పు ఇచ్చారని నిలదీస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

పోలీసులకు సవాల్ గా యువత తీరు..

ఇటీవల కాలంలో జల్సాలకు అలవాటు పడుతున్న యువత గ్రూపులుగా ఏర్పడి డ్రగ్స్, గంజాయి పీల్చిన మత్తులో కొందరి పై దాడులు చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సంబంధిత కొందరు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గద్వాల పట్టణ శివారులో గంజాయి, మద్యం తాగుతూ విచక్షణ కోల్పోయి కొందరు యువకులు అర్ధరాత్రి దాటాక దొంగతనాలకు సైతం వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇటీవల పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు నిదర్శనం పోలీసులు ఇలాంటి వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ గేమింగ్ లో కూరుకుపోయిన యువతను కట్టడి చేయడంలో అటు తల్లితండ్రులు ఇటు పోలీసులు ఇలాంటి వారి పై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలైన వారిని కట్టడి చేస్తే సమాజానికి మేలు చేసిన వారు అవుతారని అంటున్నారు పట్టణ ప్రజలు.

బజారున పడుతున్న కుటుంబాలు..

తమ విలువలకు తిలోదకాలిచ్చి ప్రయోజకుడవుతాడనుకున్న తమ పుత్రరత్నాలు తమను బజారున పడేస్తున్నారని కొందరు తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేం లేక కొడుకులను దూరం చేసుకోలేక సమాజంలో తమకున్న విలువల్ని కాపాడు కోవడం కోసం కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా కొడుకులు చేసిన అప్పులను తండ్రులు తీరుస్తున్నారన్న పుకార్లు జిల్లాలో వినిపిస్తున్నాయి.


Similar News