'రౌడీలను, గుండాలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం'
నియోజకవర్గంలోని రౌడీలు, గుండాలు, భూ కబ్జాదారులు ప్రజలను బెదిరించినా, ఇబ్బందులకు గురిచేసినా కఠినంగా చర్యలు చేపడతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
దిశ, మహబూబ్ నగర్ : నియోజకవర్గంలోని రౌడీలు, గుండాలు, భూ కబ్జాదారులు ప్రజలను బెదిరించినా, ఇబ్బందులకు గురిచేసినా కఠినంగా చర్యలు చేపడతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రజలకు ఎల్లప్పుడు సేవకుడిలా పనిచేస్తానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను కలవవచ్చని, దళారీలకు చోటు లేదని ఆయన తెలిపారు.
మహబూబ్ నగర్ లో చీకటి రోజులు పోయాయని ఇక పై వెలుగులు నింపే రోజులు వచ్చాయని అన్నారు. అహంకారులకు, భూ కబ్జాదారులను చోటు లేదని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినా ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే కార్యాలయం ఇకనుంచి ప్రజల క్యాంపు కార్యాలయం అని, ప్రజలకు ఏ ఆపద ఎదురైనా నన్ను సంప్రదించాలని, మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు పోతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, చంద్రకుమార్ గౌడ్, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సిజే బెనహర్, నాయకులు బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సాయిబాబా, నాగరాజ, చంద్రశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.