పది నెలల కాలంలోనే పదేళ్ల అభివృద్ధిని కోల్పోయాం
పదేళ్ళ కాలంలో మనం సంపాదించుకున్న అభివృద్ధిని పది నెలల కాలంలో కోల్పోయామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పదేళ్ళ కాలంలో మనం సంపాదించుకున్న అభివృద్ధిని పది నెలల కాలంలో కోల్పోయామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వరాష్ట్ర సాధనకై 2009 నవంబర్ 29 న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో ఉద్యమం కీలక మలుపు తిప్పిన నవంబర్ 29 ను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 'దీక్షా దివస్' కార్యక్రమంలో ఆయన పార్టీ అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి లతో కలిసి ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల తమ పాలనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెడితే,లేని భ్రమలు కల్పించి అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతు రుణమాఫీ చేస్తామని చేయకుండా,రైతు బంధు ఎగ్గొట్టి రైతులను,ఆసరా పెన్షన్లు 4 వేలు చేస్తామని పేదలను,తులం బంగారం ఇస్తామని కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు,నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను,మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలను ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ రోజు పల్లెపల్లెనా కేసిఆర్ పథకాలను ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారని,మళ్ళీ కేసీఆర్ పాలనకై కడగళ్ళతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ధ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేష్,రాజేశ్వర్ గౌడ్,ఇంతియాజ్,బెక్కెం జనార్థన్,కెసి.నర్సింహులు,తదితరులు పాల్గొన్నారు.