తనువు చాలించి ఎనిమిది మందికి జీవం పోసిన మహిళ..
తాను చనిపోతూ ఎనిమిది మందికి జీవం పోసింది ఓ మహిళ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
దిశ, మక్తల్: తాను చనిపోతూ ఎనిమిది మందికి జీవం పోసింది ఓ మహిళ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మక్తల్ పట్టణంలోని శివాజీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పట్టణానికి చెందిన జయమ్మ గత మంగళవారం కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్ల గట్టు మారెమ్మ గ్రామ దేవతకు మొక్కులు చెల్లించేందుకు మక్తల్ నుండి బస్సులో వెళుతూ గ్రామ స్టేజి దగ్గర బస్సు దిగుతూ జారిపడి తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్ కావడంతో స్వచ్ఛంద సంస్థ భర్త చాకలి లక్ష్మణ్‌ను ఒప్పించి ఆమె అవయవాలను నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ అసోసియేషన్ (NOTTO) వారి చొరవతో ఎనిమిది మందికి అమర్చారు. ఎనిమిది మందికి అవయవ దానం చేసి ప్రాణం పోసిన ప్రాణదాత, త్యాగశీలి అయిన జయమ్మ.. దాన గుణంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. మక్తల్ పట్టణంలో జయమ్మ త్యాగ గుణాన్ని పొగుడుతూ ఆదివారం రాత్రి అంతిమ యాత్రలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.