విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్.. బాలుడికి తీవ్ర గాయాలు

పది నిమిషాలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని విద్యార్థినిని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-09-14 14:03 GMT

దిశ, బిజినేపల్లి: పది నిమిషాలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని విద్యార్థిని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం… బిజినేపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన పెద్ద బురాన్ తన కుమారుడు సురేందర్ బిజినేపల్లి మండల కేంద్రంలోని మేధాంస్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్ కి 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని కర్రతో మేధాంస్ ప్రిన్సిపాల్ రమేష్ విచ్చలవిడిగా కర్రతో దాడి చేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ గాయాలు భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన తన స్నేహితులు అతన్ని సముదాయించి బైకుపై గౌరారం గ్రామానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థి శరీరంపై ఉన్న గాయాలను చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థిని కర్రతో దాడి చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం ఎంఈఓ, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Similar News