బొగ్గు గనుల పదవ వేలంపాట నిలిపి, సింగరేణికి అప్పగించాలి.. సీఐటీయు
బొగ్గు గనుల పదవ వేలంపాట నిలిపివేయాలని, తెలంగాణలో బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి అప్పగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాజు డిమాండ్ చేశారు.
దిశ, వనపర్తి : బొగ్గు గనుల పదవ వేలంపాట నిలిపివేయాలని, తెలంగాణలో బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి అప్పగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాజు డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ భారత దేశవ్యాప్తంగా 500 బొగ్గు గనులు ఉండగా, ఇప్పటికే 300 బొగ్గు గనులను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టారని, ప్రస్తుతం 67 బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు, కార్పొరేటు పెట్టుబడిదారులకు వేలంపాట ద్వారా అప్పగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ వేలం పాటను వ్యతిరేకిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. గనులను ప్రైవేటు కార్పొరేటు శక్తులకు కట్టబెట్టడానికి పదో విడత వేలం ప్రక్రియ మొదలు పెట్టారని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి పదవి చేపట్టగానే తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కూడా వేలం వేయడం శోచనీయమన్నారు. ఈ బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు టన్ను 3500 నుంచి 4 వేల మధ్య అమ్మే సింగరేణి బొగ్గు అందలేదు. అదే సాకుతో టన్నుకి 18 వేలకు ఏకంగా ఆదాని ద్వారా నుంచి 17 లక్షల టన్నుల బొగ్గు కొన్నారు. కొన్నభారం రాష్ట్ర ప్రజలపై భారం పడే దుస్థితిదాపురించిందన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటు ఆసాములకు కట్టబెట్టేందుకు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2021- 22 బడ్జెట్లో ప్రకటించి 2025 నాటికి మొదట ఆరు లక్షల కోట్ల లీజు పై ప్రైవేటు వారికి అప్పగించారని, ఆ తర్వాత 11 లక్షల కోట్లు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాలని భావిస్తున్నారన్నారు.
కీలకమైన కోల్మైన్ రంగంలో ఈ వేలంపాట ప్రక్రియకు తలుపులు తీయడం మరో విధమైన ప్రైవేటీకరణ దారి తీసినట్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓరు క్యాస్టింగ్ మెయిన్స్ ఇవ్వకపోవడం, ఆ రకంగా నష్టాల్లోకి నెట్టేయడం, ఆ తర్వాత ప్రైవేటు వారికి అప్పగించడం మరోరకమైన ప్రైవేటీకరణ ప్రక్రియ కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మిక సంఘాలు అన్ని అనుబంధాలతో నిమిత్తం లేకుండా కలిసి రావాలని, ప్రజలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, హమాలి సంఘం, తోపుడు బండ్ల కార్మిక సంఘం కార్మికులు, నాయకులు రాములు, శాంతన్న, గోవిందు, సూరి, సాయిలు, యాదగిరి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.