సంక్షేమ పథకాల సమస్యలను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్ రవి నాయక్

ధరణి, ప్రజావాణి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల సమస్యలను వెంట వెంటనే పరిష్కరించడం వల్ల ప్రజలలో నమ్మకం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు.

Update: 2023-05-18 15:46 GMT

దిశ, మహబూబ్ నగర్: ధరణి, ప్రజావాణి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల సమస్యలను వెంట వెంటనే పరిష్కరించడం వల్ల ప్రజలలో నమ్మకం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో తహసీల్దార్లతో నిర్వహించిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్లు ధరణి, ప్రజావాణి, ఈ-ఆఫీస్ తదితర పిటిషన్లను వేగవంతంగా పరిష్కరిస్తుండడం పట్ల ఆయన వారిని అభినందించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాల జప్తు, జరిమానా విధింపుపై సమీక్షిస్తూ అనుమతి లేని వాహనాలను ఎట్టి పరిస్థితులలో వదలొద్దని, అలాంటి వాటిపై జరిమానా విధించాలని తెలిపారు.

ఈ వారంలో 139 వాహనాలను తనిఖీ చేసి 18 వాహనాలకు అనుమతులు లేని వాటిగా గుర్తించి వాటికి 1.46,400 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు మైన్స్ ఏడీ విజయకుమార్ వివరించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తహసీల్దార్ స్థాయిలో ఇంకా 110 ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేల వద్ద సంతకం కోసం పెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణి దరఖాస్తులను ప్రతిరోజు 130 నుంచి 140 వరకు పరిష్కరిస్తుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

జీఎల్ఎం, మ్యుటేషన్, సబ్ సక్సెసన్ వంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మిస్సింగ్ సర్వే నంబర్లు పంపించే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూడాలని, అలాగే కోర్టు కేసులకు సంబంధించినవి, జీపీఏ అప్లికేషన్స్ జాప్యం లేకుండా పరిష్కరించాలని అన్నారు. ధరణితో పాటు, ప్రజావాణి, ఈ-ఆఫీస్ ఇతర దరఖాస్తులన్నీ ముందుగా డిసెంబర్ 22 వరకు పరిష్కరించాలని, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలవారీగా పరిష్కరిస్తూ రావాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీవో అనిల్ కుమార్, మైన్స్ డిఈ విజయ్ కుమార్, గృహ నిర్మాణశాఖ ఈఈ వైద్యం భాస్కర్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News