ఉన్నత లక్ష్యాలతో అందనంత ఎత్తుకు ఎదగాలి
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ,వాటిని సాధించుకొని అందనంత ఎత్తుకు ఎదుగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ,వాటిని సాధించుకొని అందనంత ఎత్తుకు ఎదుగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను,'దేశ్ పాండే ఫౌండేషన్' బృందంతో కలిసి సందర్శించి మాట్లాడారు. పట్టణంలోని రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయమని ఆయన అన్నారు.చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న 500 మంది విద్యార్థులకు దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్,ఇంగ్లీష్,కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని,డిగ్రీ పూర్తి అయిన వెంటనే, ఏదైనా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఎంతో ఉపయోగపడుతుదన్నారు.
మహబూబ్ నగర్ విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని,తగ్గరని,వారిలో ఎంతో శక్తి దాగి ఉందని,మీకు కావల్సిన అన్ని వసతులు,సౌకర్యాలు తాను కల్పిస్తానని,ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ లో జరిగే మొదటి బ్యాచ్ ను పైలెట్ బ్యాచ్ గా ఎంచుకోవాలని దేశ్ పాండే ఫౌండేషన్ ప్రతినిధులను తాను కోరానని,దానికి వారు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. బాహ్య పరిజ్ఞానం లేకపోతే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతామని,అందుకే దిన పత్రికలను ప్రతి ఒక్కరూ విధిగా చదువాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన 'ఒక రోజు జాతీయ సదస్సు' గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల,శేఖర్,విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్,ప్రిన్సిపాల్ డాక్టర్.రాజేంద్రప్రసాద్,నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి,గుండా మనోహర్,తదితరులు పాల్గొన్నారు.