వంట తంటా.. బిల్లులు రాక అప్పులపాలవుతున్న వంట ఏజెన్సీలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోతున్నారు.
దిశ ప్రతినిధి వనపర్తి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా గత 8 నెలలుగా మంజూరు చేయడం లేదు. పెండింగ్ బకాయిలు లక్షల్లో పేరుకుపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతవుతున్నారు. విద్యార్థులను పస్తులుంచకుండా అప్పు చేసి మరి వండి వారిస్తున్నారు. పెండింగ్ బిల్లులకు తోడు ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ.5 మాత్రమే ఇస్తుండగా మార్కెట్ లో ఒక గుడ్డు ధర 6 రూపాయలు పలుకుతుంది. గుడ్డుపై ఒక రూపాయి అదనంగా చెల్లించాల్సి వస్తుందని, దీనివల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీలు వాపోతున్నాయి. కొత్త మెనూ ప్రకారం అన్ని రకాల కూరలు చేయాలంటే తడిసి మోపెడవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు.
బిల్లుల కోసం ఎదురుచూపు..
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్ని కలిపి 510 ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ఎనిమిదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఒకరికి రూ. 8.17, ఇక తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు ఒకరికి రూ.10،67 చొప్పున ప్రభుత్వం వంట ఏజెన్సీలకు చెల్లిస్తుంది. ప్రతినెలా ఏజెన్సీ వారి ఖాతాలో జమ కావలసి ఉంటుంది. అయితే గత 8 నెలల నుంచి మధ్యాహ్న భోజనం బిల్లులు రావడం లేదు. మండల కేంద్రంలో గాని జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో దాదాపు వెయ్యి వరకూ విద్యార్థుల సంఖ్య ఉండడంతో ప్రతినెలా దాదాపు ఏజెన్సీలకు రూ. లక్ష వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అయితే గత కొన్ని నెలల నుంచి సకాలంలో బిల్లులు రాకపోవడంతో బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. బిల్లుల కోసం వంట ఏజెన్సీ మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో గత్యంతరం లేక మహిళలు అప్పులు చేసి మరి తీసుకొచ్చి విద్యార్థులకు వండి వారుస్తున్నారు.
ఆరు రూపాయల గుడ్డుకు రూ. 5 చెల్లిస్తున్నారు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనం వసతి కల్పించిన ప్రభుత్వం వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ప్రత్యేకంగా మెనూ తయారు చేసింది. దీనిలో భాగంగా వారానికి మూడు రోజులు భోజనంలో విద్యార్థులకు ఉడకపెట్టిన గుడ్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక గుడ్డుకు ప్రభుత్వం రూ. 5 చొప్పున చెల్లిస్తుంది . కాగా గత కొన్ని నెలలుగా మార్కెట్లో ఒక గుడ్డు ధర రూ.6కు పలుకుతుంది. దీంతో వంట ఏజెన్సీలవారు ఒక గుడ్డుపై ఒక రూపాయి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని, నష్టమే తప్ప లాభం లేదని మహిళలు వాపోతున్నారు. అదే విధంగా ఆకుకూర పప్పు, మిక్స్డు, వెజిటేబుల్ కర్రీ ఇవ్వాలని నిబంధనలు దీనివల్ల తమకు మరింత ఓవైపు లక్షల్లో బకాయిలు ఉండగా తామ అప్పులు చేసి మరి సరుకులు తెచ్చుకుంటున్నామని, అలాంటిది కొత్త మెనూ ప్రకారం అన్ని రకాల కూరలు చేయాలంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకుల రావలసిన బిల్లులు చాలా పెండింగ్ లో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
నగలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాం.. లింగమ్మ వంట నిర్వాహకురాలు, వనపర్తి
బాలుర ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం వంట చేసి విద్యార్థులకు అందిస్తున్నాం. అయితే గత ఎనిమిది నెలల నుంచి దాదాపురు 8 లక్షల పైగా పెండింగ్ లో ఉండగా రెండు లక్షలు మాత్రం బిల్లులు వచ్చాయి. మరో వైపు డబ్బులు చెల్లిస్తేనే సరుకులు, కూరగాయలు ఇస్తామని వ్యాపారి చెప్తుండడంతో గత్యంతరం లేక బంగారు నగలు తాకట్టుపెట్టి వంట చేసి పెడుతున్నాం. ఇప్పటికీ మాకు దాదాపు 6 లక్షల రూపాయలు రావాల్సి ఉంది.
బిల్లులన్నీ ఎంఈఓకు పంపించాం.. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయుడు, బాలుర ఉన్నత పాఠశాల వనపర్తి
వంట ఏజెన్సీలకు గత కొన్ని నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే. అయితే మేము ప్రతినెలా బిల్లులు చేసి ఎంఈఓ ద్వారా ఎస్ టి ఓ కార్యాలయానికి పంపిస్తున్నాం. అయితే అక్కడ ఈ కుబేర్ లో బిల్లులు ఆగిపోతున్నాయి. ఉన్నతాధికారులను సంప్రదించగా త్వరలో బిల్లు వస్తాయని చెప్తున్నారు.