అభివృద్దిని చూడండి ...మరోసారి అవకాశం ఇవ్వండి : నిరంజన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని , రైతు బంధు, రైతు బీమా పథకాలతో అండగా నిలబడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ, ప్రతినిధి వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని , రైతు బంధు, రైతు బీమా పథకాలతో అండగా నిలబడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరు మండలంలోని పాతపల్లి, అయ్యవారిపల్లి , తిప్పాయపల్లి, గుమ్మడం ,గుమ్మడం తండా, చిన్న గుమ్మడం, యాపర్ల ,బూడిదపాడు, ఈర్లదిన్నె, పెంచికలపాడు, మునగామన్ దీన్నే, జనంపల్లి, బునాదిపూర్, పాత సుగూర్, కొత్త సూగూరు గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ దశ మారిందని , తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తరువాత మారిన జీవన పరిస్థితులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్ కు డోకా లేదని, పంటలకు పెట్టుబడి ఇచ్చి పంటలు పండిన తరువాత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొని నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే అని మంత్రి అన్నారు. 50 ఏండ్లు పాలన చేసినప్పుడు సాగునీళ్లు ఇవ్వలేదు .. ప్రజలను వలసలు పాలు చేసి పట్టించు కోలేని కాంగ్రెస్ పార్టీ నేడు అవి చేస్తాం ఇవి చేస్తామని కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టడానికి వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. రైతులకు ఏం అవసరం ఉన్నా చేసుకుంటూ వచ్చామని , సింగోటం నుండి ఒక కాలువ ద్వారా గోపాల్ దీన్నే రిజర్వాయర్ నీళ్లు వస్తే చివరి ప్రాంతాలకు ఇబ్బంది ఉండదని కొల్లాపూర్ ఎమ్మెల్యే తో కలిసి సి ఎం కేసీఆర్ కు పలుమార్లు చెప్పి ఒప్పించి రూ.150 కోట్ల మంజూరు చేయించిానని, ప్రస్తుతం కాలువ పనులు నడుస్తున్నా యన్నారు.
సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చినప్పుడు అందరిని ఇంటికి పిలిపించి నాకు ఉన్నంతలో టిఫిన్, భోజనం పెట్టి మీ అందరి మధ్యలో మీతో కలిసి భోజనం చేసి మీ కుటుంబ సభ్యునిలా మీతో ఉన్నాను .. భవిష్యత్తు లో కూడా అలాగే ఉంటానని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అందజేస్తామన్నారు. ఈవీఎం మిషన్ లో నాకు 2వ నెంబర్ వచ్చిందని అందులో నా ఫోటో కూడా ఉంటుందని కనుక 2 వ నెంబర్ మీద ఓటేసి మీరు రెండోసారి శాసనసభకు నన్ను పంపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
మంత్రి సమక్షంలో పార్టీలో చేరికలు ....
పాతపల్లి గ్రామంలో 20 మంది గ్రామస్థులు, పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామం నుండి 60 మంది వివిధ పార్టీల నాయకులు గుమ్మడం గ్రామంలో వేరు వేరుగా మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాతపల్లి గ్రామానికి చెందిన లోకేష్ నాయుడు షాట్ బాల్ క్రీడలో రాణించి దేశం తరఫున విదేశాలకు వెళుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.