దేవరగుట్టలో చిరుతల స్థిరనివాసం

మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామ సమీపంలో గల దేవరగుట్టలో గత మూడు రోజులుగా రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.

Update: 2025-04-14 08:22 GMT
దేవరగుట్టలో చిరుతల స్థిరనివాసం
  • whatsapp icon

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామ సమీపంలో గల దేవరగుట్టలో గత మూడు రోజులుగా రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతల సంచారంతో యన్మన్ గండ్ల గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తుంది. గ్రామానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో గల దేవరగుట్టలోకి ఎక్కడి నుండో వచ్చి చేరిన చిరుతలు ఆ గుట్టలోనే ఆవాసం ఉంటూ బండరాళ్ల పై సేదతీరుతూ అటుగా వెళ్లిన వారి కంటపడుతున్నాయి. మిగతా సమయాల్లో గుట్ట లోపలి గుహల్లో నివాసం ఉంటున్నాయి. గ్రామానికి అతి సమీపంలో నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో చిరుతల సంచారం ప్రజలను, గుట్ట చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు గల రైతులను తీవ్రంగా కలవరపరుస్తుంది. గుట్టలో చిరుతలు కనిపిస్తున్నప్పటి నుండి అవి ఎవరికి హాని తలపెట్టక పోయినా భవిష్యత్తులో హాని తలపెట్టవచ్చునని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

అందువల్ల అటవీ శాఖ అధికారులు చిరుతలను సాధ్యమైనంత త్వరగా బంధించి వాటిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి తమకు వాటి బారి నుంచి ఎలాంటి హాని లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కాగా చిరుతల సంచారం గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దేవరగుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. అధికారుల అనుమతితో దేవరగుట్టలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని చిరుతలను బంధించి వాటిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని, అంత వరకు వాటి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అంతేకాక అటువైపు ప్రజలు వెళ్లకూడదని, పశువులను కూడా మేపడానికి అటువైపు తీసుకు వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఏది ఏమైనా ఈ చిరుతలను సాధ్యమైనంత త్వరగా బంధించి తీసుకువెళ్లి తమలో నెలకొన్న భయాందోళనలను రూపుమాపేందుకు అధికారులు చొరవ చూపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Similar News