ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలి
నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
దిశ, నారాయణ పేట ప్రతినిధి : నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ, కోస్గి రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మక్తల్, నారాయణ పేట నియోజక వర్గాలలో భూసేకరణ ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. భూసేకరణ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆమె అడిగారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ స్పందిస్తూ.. జిల్లాలోని మక్తల్, నారాయణ పేట నియోజక వర్గాల పరిధిలో మొత్తం 21 గ్రామాలలో 556 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 16 గ్రామాలలో భూసేకరణ గాను ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.
అయితే ఆ 16 గ్రామాలకు సంబంధించి మొత్తం 379.07 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మిగతా 5 గ్రామాలలో భూసేకరణ ప్రాసెస్ లో ఉందని ఆర్డీవో రాంచందర్ నాయక్ తెలిపారు. అంతకుముందు కోస్గి రోడ్డు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా.. కోస్గి పట్టణంలో మొత్తం 228 వ్యాపార, నివాస గృహాలు విస్తరణ లో పోతున్నాయని, వాటిలో 139 సొంత స్థలాలు, 89 ఖాళీ స్థలాలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. వీరిలో కొంతమంది కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కోస్గి రోడ్డు విస్తరణ పనులను ఎలాంటి వివాదాలు లేకుండా అర్హతను బట్టి నష్ట పరిహారం చెల్లించి ముందుకు వెళ్లాలని అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆమె సూచించారు.