ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

Update: 2024-08-06 03:00 GMT

దిశ, నగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో నివాసం ఉంటున్న సాయిశ్వర్ తన కూతురు కావ్య గర్భం దాల్చడంతో తన తల్లిగారిల్లు అయిన నాగర్ కర్నూల్‌లో ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పట్టణంలోని ప్రియాంక హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు సర్జరీ చేయగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు. ఆ ఆనంద క్షణాలను బంధువులతో పంచుకునే లోపే సాయంత్రం కావ్యకు సీరియస్‌గా ఉంది హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.

వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలల క్రితం తాడూరుకు చెందిన పద్మ పురిటి నొప్పులతో వస్తే నర్స్‌తో ఇంజక్షన్ వేయించడంతో అది వికటించి మృతి చెందింది. దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేసి జరిమానా విధించారు. నెల క్రితం తెరుచుకున్న ఆస్పత్రి మరో మృతికి కారణమవడం శోచనీయం. ఫైన్ వేసి సీజ్ చేసిన ఆసుపత్రి తీరు మారడం లేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కావ్య పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.


Similar News