ముగ్గురు చనిపోతే పరామర్శించే దిక్కు లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద కార్వీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించే దిక్కు లేకుండా పోయిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద కార్వీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించే దిక్కు లేకుండా పోయిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బుధవారం ఉదయం ఆయన దివిటిపల్లిలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్ళి పరమార్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికొచ్చిన ముగ్గురు యువకులు చనిపోతే జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరమార్శించకపోవడం సరియైనది కాదని ఆయన ఆరోపించారు.
అధికారులు పర్యంటించాలన్నా, పరమార్శించాలన్నా, ఓదార్చాలన్నా ఎవరి నుంచైనా అనుమతి తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. కార్వీకి అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు అక్కడి పనులు నిలపాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు సహాయం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. అంతకు ముందు మాజీమంత్రి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మార్చూరిలో ఉన్న మృతదేహాలను పరిశీలించి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు అప్పజెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శివరాజ్, రాఘవేందర్ గౌడ్, అంబాదాస్, శివ, తదితరులు పాల్గొన్నారు.