కాంగ్రెస్ పార్టీ చేజిక్కనున్న డీసీసీబీ చైర్మన్ పదవి..?
ఉమ్మడి జిల్లాలో మరో కీలకమైన పదవి అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో మరో కీలకమైన పదవి అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. నాలుగేండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక డైరెక్టర్ స్థానాలను గెలుచుకొని చైర్మన్ పదవిని దక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే.. కీలకమైన ఈ పదవిని దక్కించుకోవడానికి అప్పట్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న కోరమోని వెంకటయ్య, జక్క రఘునందన్ రెడ్డి తదితరులు ప్రయత్నించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన నిజాం పాషా కు చైర్మన్ పదవి దక్కింది. అనారోగ్యం కారణంగా ఆయన తన పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఎంపిక అనివార్యమైంది. ఈనెల 13వ తేదీ లోపుగా ఎన్నికలు నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించినా కొన్ని కారణాలతో వాయిదా పడింది.
కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా ఇప్పటికే కొందరు డైరెక్టర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యారు. అప్పట్లో చైర్మన్ పదవిని ఆశిస్తున్న మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఉండడంతో పదవిని దక్కించుకోవడానికి. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు, బీఆర్ఎస్ నుండి కోరముని వెంకటయ్య పదవిని ఆశిస్తున్నారు. మరో ఏడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ పదవిని ఏకగ్రీవం చెయ్యాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు డీసీసీబీ చైర్మన్ ఎంపిక అంశంపై చర్చలు జరిపిన విషయం పాఠకులకు విధితమే.
మావిళ్ళపల్లికి చైర్మన్ పదవి..!?
సీనియర్ నేత మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్ గా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి జూపల్లి, ఎంపీ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మంత్రి జూపల్లి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల తో చర్చించి డీసీసీబీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించాలని చేసిన విజ్ఞప్తికి సానుకూలత లభించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఏవైన అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప మామిళ్ళపల్లి కి పదవి దక్కడం తథ్యమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కీలక పదవిని కోల్పోనున్న బీఆర్ఎస్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలక పదవిని బీఆర్ఎస్ కోల్పోయే పరిస్థితులు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం 15 మంది డైరెక్టర్లలో బీఆర్ఎస్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు డైరెక్టర్లు ఇప్పటికే చెయ్యందుకున్న విషయము పాఠకులకు విదితమే.. ఎన్నికల్లో మిగతా డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండడంతో కీలకమైన డీసీసీబీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కోల్పోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఈనెల 23న చైర్మన్ ఎంపిక
ఈనెల 23న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక షెడ్యూలును ఎన్నికల నిర్వహణ అధికారి, సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ టైటస్ పాల్ ఆదివారం విడుదల చేశారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను బి ఆర్ ఎస్ గెలుచుకొని చైర్మన్ పదవిని దక్కించుకున్న విషయం పాఠకులకు విధితమే. చైర్మన్ గా ముక్తల్ నియోజకవర్గానికి చెందిన చిట్యాల నిజాం పాషా ఎంపికై దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా పదవిలో కొనసాగారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన నిజాం పాషా కోలుకోక పోవడంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ ఎంపిక ప్రక్రియ అనివార్యం అయ్యింది.
నూతన చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికల నిర్వహణ అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం ఈనెల 23వ తేదీన జరగనుంది. ఈనెల 23న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు డిసిసిబి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 11 గంటల నుంచి 11:30 గంటల మధ్య నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఎన్నిక ఏకగ్రీవం కాకుంటే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.