నిర్లక్ష్యపు నీడలో సీసీ రోడ్ల నిర్మాణాలు.. నాణ్యతపై ప్రశ్నించిన తండావాసులపై దాడులు..

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అనడానికి వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని చంద్రనాయక్ తండానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Update: 2023-04-20 12:22 GMT

దిశ, అమరచింత: గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అనడానికి వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని చంద్రనాయక్ తండానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీఎం ప్రత్యేక హామీ ద్వారా గ్రామపంచాయతీకి మంజూరైన రూ. 20లక్షల నిధులతో చంద్రనాయక్ తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఈ పనులను సర్పంచ్ శిల్ప సోదరుడు రాజ్ నాయక్ కాంట్రాక్టు తీసుకొని గత నెలలో పనులు చేపట్టి,135 మీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తి చేశాడు. బుధవారం మారెమ్మ గుడి ముందు నుంచి 90 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో తండావాసులు పనులను అడ్డుకున్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు చేయడం తగదని, పనులు చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా గుత్తేదారు మనుషులు తండావాసులపై దాడికి పాల్పడడంతో సీసీ రోడ్ల పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా 5 ఇంచుల ఎత్తు లోపు రోడ్లు వేయడం, ఒక్కో చోట 2 ఇంచులు ఎత్తు వేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసే క్రమంలో లావుపాటి గుండు రాళ్లను కూడా అందులో కలిపి వేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో వేసిన రోడ్ల విషయంలో కాంట్రాక్టర్ రాజ్ నాయక్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధికారుల పర్యవేక్షణ లేకుండానే నాసిరకం రోడ్లు వేసి, క్యూరింగ్ కూడా చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంజనీర్ల పర్యవేక్షణలో వేయవలసిన సీసీ రోడ్లు అధికారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్ పనులు చేపట్టడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండాలో జరుగుతున్న నాసిరకం పనుల వైపు సంబంధిత అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, నాణ్యత ప్రమాణాలతో రోడ్డు వేయాలని తండావాసులు కోరుతున్నారు. 



 


Tags:    

Similar News