అత్యుత్తమ విద్య, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే జీఎంఆర్

విద్యార్థులకు అత్యుత్తమ విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-14 09:10 GMT

దిశ, భూత్పూర్ : విద్యార్థులకు అత్యుత్తమ విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపల్ కేంద్రం జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ , కాస్మోటిక్ చార్జీల పెంపుదల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం దోపిడీ చేసుకోవడం తప్ప.. కనీసం విద్యార్థులకు సరైన భోజన వసతులు, కాస్మోటిక్ చార్జీలు చెల్లించలేదు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గానే కాకుండా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు.


2500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ జాయింట్ సెక్రటరీ శివలింగయ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను సద్వినియోగం పరుచుకొని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ చైన్ సెక్రటరీ , ఇతర ముఖ్యులు భోజనాలు చేశారు. అంతకుముందు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినిలు ముఖ్య అతిథులకు ఘనస్వాగతం పలికారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుగుణ శ్రీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఆర్ సి ఓ వెంకట్ రెడ్డి, తహసిల్దార్ అబ్దుల్ రహమాన్, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లిక్కి విజయ్ గౌడ్, జైదు శ్రీనివాస్, మాస గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



 



Similar News