గులాబీ నేతల ప్రచారం షురూ

అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా ఎన్నికల ప్రచారం ఆరంభించారు.

Update: 2023-07-12 02:33 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా ఎన్నికల ప్రచారం ఆరంభించారు. అధిష్టానం సూచనల మేరకు ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వకుండా, పార్టీకి ఉన్న పట్టు ఏ మాత్రం సడలకుండా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆ అడుగులు ఎన్నికల ప్రచారం అన్న భ్రమ కలగకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాయా?...అందితే ఏ ఏ పథకాలు అందాయి..? అందకపోతే ఎందుకు అందలేదు..? తదితర వివరాలు సేకరించడం తో పాటు ఓటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ప్రతి వార్డుకు ఇన్చార్జీలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను మళ్లీ గెలుచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంతో పాటు వాటిని పకడ్బందీగా అమలు చేయాలని అధిష్ఠానం చేసిన ఆదేశాలు, సూచనలను మంత్రులు ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా ప్రతి పథకం లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఎమ్మెల్యేలు అందజేస్తున్నారు. మరోవైపు పట్టణాలు, గ్రామాలలో వార్డుల వారీగా ఇన్చార్జిలను నియమించి సమాచారం సేకరిస్తున్నారు. సేకరించిన ఫోన్ నెంబర్లకు స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం పరచుకుంటున్నారు..

మంత్రులు, ఎమ్మెల్యేలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులు, పేరున్న ఇతర ముఖ్య నాయకులు, అధికారుల ఇండ్లలో జరిగే శుభకార్యాలు అన్నింటికి హాజరవుతున్నారు. ఆయా గ్రామాల్లో జరిగే బోనాలు, జాతరాల వంటి పండగలను అసలే వదలడం లేదు. ఈ కార్యక్రమాలకు నేతలు హాజరయ్యే విధంగా ఆయా గ్రామాలు, మండలాలు, పట్టణాలకు చెందిన నాయకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా వ్యూహాలు..

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమదే ఉండే విధంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి విస్తృతంగా ప్రచారాలు నిర్వహించడంతో పాటు, కొత్త పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు సర్దుబాట్లు చేసుకొని, ప్రజల్లోకి వచ్చేలోపే తామే అప్పటికీ అనధికారిక ప్రచారాలు పూర్తిచేసుకుని ఎన్నికల రంగంలోకి దూకే విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు వేస్తున్న అడుగులు ఏమేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి మరి.


Similar News