Collector BM Santosh : వసతి గృహాల విద్యార్థులకు ఈ నెల 16 నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు నిర్వహించాలి

వసతి గృహాల విద్యార్థులకు ఈనెల 16 నుంచి బయోమెట్రిక్

Update: 2024-08-13 13:48 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : వసతి గృహాల విద్యార్థులకు ఈనెల 16 నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల వసతి గృహాలను, గంజిపేట బీసీ వసతి గృహన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వసతి గృహాలలో విద్యార్థులకు తప్పనిసరిగా ఈనెల 16 నుండి బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. వసతి గృహాలలో చదువుతున్న 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు చదివించి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం ప్రతిరోజు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా వంట గదులను, భోజనశాలలను, మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరుగుదొడ్లను, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులందరినీ ఒకే దగ్గర కాకుండా తరగతుల వారిగా విభజించి విడివిడిగా ఉండేలా చూడాలన్నారు. వసతి గృహాలకు అవసరమైన తలుపులు, కిటికీల మరమ్మతు పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంతకు ముందు స్థానిక ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు.

గత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అవసరాలకు కళాశాలలో అవసరం మేరకు నిర్మూలించిన గోడలను వెంటనే పున:నిర్మించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారాలను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఆ పనులను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కలందర్ భాష, కళాశాల కమిటీ సభ్యులు సాయి శ్యామ్ రెడ్డి కలెక్టర్ తో మాట్లాడుతూ...కళాశాల కోసం వసతి గృహం తో పాటు ఒక లైబ్రరీ, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ ప్రగతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారులు బి. సరోజ, పంచాయతీ రాజ్ ఈ ఈ దామోదర్ రావు, హాస్టల్ వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News