మందుల షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్ట్
మందుల కోసమని ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్తే అందులో ఏముందో
దిశ, కల్వకుర్తి : మందుల కోసమని ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్తే అందులో ఏముందో చదవడానికి కూడా రాని భాషలో రాస్తారు. కొందరికి మొదటి అక్షరం తప్ప ఇంకేమీ అర్థం కాదు. మరికొందరికి రోగి చెప్పే లక్షణాలు అర్థం చేసుకొని ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు. ఇంకొందరికి అన్నీ తెలిసినా బ్రాండెట్ పేరిట నాసిరకం అంటగట్టి అడ్డగోలుగా దండుకోవడమే తెలుసు.డాక్టర్ రాసిచ్చే చిట్టీతో సంబంధం లేకుండా ఎవరడిగినా మందులు ఇచ్చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలోని మెజార్టీ మెడికల్‌షాపుల్లో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల కనీస అర్హతలు లేని వ్యక్తులు ఇతరుల పేరిట అనుమతులు తీసుకొని దుకాణాలు నడిపిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఒక ట్యాబ్‌లెట్ మనిషి ప్రాణాలను నిలబెడుతుంది. అవస్థతో బాధపడే రోగికి ఉపశమనం కల్గిస్తోంది. కల్వకుర్తి లోని కొన్ని మెడికల్ షాపులకు ఇదే వరంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా మెడికల్ షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏట మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే తప్ప ఆగడంలేదు. జిల్లాలో సుమారు 3 వందల పై వరకు మెడికల్ షాపులున్నట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇందులో 70 శాతానికి పైగా మెడికల్ షాపులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నట్టు విశ్వనీయత సమాచారం. వాస్తవానికి మెడికల్ షాపు నెలకొల్పాలంటే ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిష్టర్ అయి ఉండి భిఫార్మసీ, ఢఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు దాదాపు 4 వేల చాలన్‌లను అసిస్టెంట్ డైరెక్టర్ పేరున డీడీకొంత మొత్తంతో తీయాల్సి ఉంటుంది. షాపు పెట్టిన తర్వాత కూడా ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే మందులను అమ్మాల్సి ఉంటుంది.
కానీ కల్వకుర్తి మండల కేంద్రమే కాకుండా వెల్డండ,చారకొండ,వంగూరు,ఉర్కొండ,ఆమనగల్,కడ్తాల్,తలకొండపల్లి, మాడ్గుల మండలాలలోని మెజార్టీ మెడికల్ షాపులు ఇందుకు విరుద్ధంగా నడుస్తున్నాయి. అనుమతులు ఒకరి పేరుపై తీసుకొని మరొకరు నిర్వహిస్తున్నారు. షాపుల్లో మాత్రం కేవలం సర్టిఫికెట్ మాత్రమే కన్పిస్తుంది తప్ప ఆ వ్యక్తి కన్పించడు. ఏడాదికి ఇంతా అని నిర్వాహకులు ఫార్మసీ సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి మూట ముట్ట చెప్తున్నారు. ఐదేళ్లకోసారి సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేయాల్సి ఉన్నా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమేనన్న తనిఖీలు చేసేవారు కరువయ్యారు. కొందరైతే కిరాణ దుకాణాల తరహాలో గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది తమ షాపుల్లో టెన్త్, ఇంటర్ చదివిన వారిని తక్కువ వేతనాలతో పనిలో కుదుర్చుకుంటున్నారు. కొందరు నిర్వాహకులతో పాటు పని చేసే వారు కూడా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు.. అయినా మందులిస్తున్నారు. ఒక్కోసారి ఏం రాస్తారో తెలియక ఒక మందుకు బదులు మరో మందులిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్సిటల్స్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసి తమ దుకాణాల్లోనే లభించేటటువంటి కంపెనీల మందులను అమ్ముతున్నారు. ఇందుకోసం కొందరు వైద్యులతోనూ ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారు. మొత్తంగా రోగుల నుండి అడ్డగోలుగా దండుకుంటూ లక్షలు గడిస్తున్నారు. ప్రతియేటా వ్యాపారం కోట్లల్లో జరుగుతుంది.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు..
డాక్టర్‌లు రాసే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు లివ్వద్దని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. మెజార్టీ మెడికల్ షాపుల్లోను దీనీని బేఖాతర్ చేస్తున్నారు. మందుల చీట్టిల్లేకుండానే కిరాణ షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆసుసత్రులకు అనుబంధంగా ఉన్న కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు, సేల్స్ కౌంటర్ ఎక్కువగా ఉండే యజమానులు మరోఅడుగు ముందుకేస్తున్నారు. చిన్న చిన్న ఫార్మసీ కంపెనీలతో మాట్లాడుకొని మందుల షీట్‌పై తమకు నచ్చినట్లు ఎంఆర్‌పీ వేయిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకే కొన్ని మందులు ఆసుపత్రులకు అనుకొని ఉండే దుకాణాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. డాక్టర్లతో ఆ మందులనే రాయించుకోని రోగుల నుండి భారీగా దండుకుంటున్నారే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పై విషయంపై డ్రగ్ ఇన్‌స్పెకర్ ను ఫోన్‌ద్వార వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
చాలా వరకు మెడికల్ షాపుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. ఒకరిపేర అనుమతి తీసుకొని కనీస విద్యార్హత లేని వ్యక్తులు మందులు విక్రయిస్తున్నారు. నాసిరకం మందులమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పైగా రోగుల నుండి ఇష్టారాజ్యంగా దోపిడి చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా పట్టించుకునే వారు కరువయ్యారు.అధికారులు 'మామూలు' గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎవరైనా మెడికల్ షాపులపై ఫిర్యాదు చేస్తే స్పందించి వెనుదిరుగుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మందుల దుకాణాల పై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.