లాయలిస్టు VS లాబీయిస్టు.. ఆ సెగ్మెంట్‌లో ఇద్దరు ఎమ్మెల్సీల పోటీ!

జనగామ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది.

Update: 2023-08-23 03:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జనగామ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని పక్కన పెట్టడంతో ఆ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై హైకమాండ్ సతమతమవుతున్నది. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుందోననే లెక్కలు వేసుకుంటున్నది. ఇద్దరిలో ఎవరు బెటర్ అనే విషయంపైన మరో సారి సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

పార్టీలో ఉద్యమకాలం నుంచి కొనసాగుతున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తారా? లేక మధ్యలో చేరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపుతుందా? అనేది ఆసక్తిగా మారింది. నిత్యం ప్రగతిభవన్‌లో ఉండే పల్లా.. తనకు ఎలాగైన టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరో వైపు తనకు స్థానిక ప్రజల బలం ఉన్నదంటూ పోచంపల్లి సైతం ఆధారాలు చూపుతున్నట్టు టాక్. ఇక ప్రస్తుతం జనగామ ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడు కాదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ఆ స్థానం కోసం పోటీపడుతున్న ప్లలా, పోచంపల్లి ఇద్దరూ స్థానికేతరులే కావడం గమనార్హం. దీంతో వీరిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే విషయంపై గులాబీ బాస్ ఆరా తీస్తున్నట్టు టాక్. మరో వైపు వీరిద్దరినీ కాదని స్థానికుడైన మండల శ్రీరాములు‌కు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక భయం

పల్లాకు జనగామ అసెంబ్లీ టికెట్ ఇస్తే తలెత్తే పరిణామాలపైనా కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. పల్లా గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహకరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ పల్లా గెలిస్తే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవిని ఆయన వదులుకుంటే దానికి ఉప ఎన్నిక అనివార్యం. ఆ బైపోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ ఓట్లు వేస్తారా? అనే భయం పార్టీ లీడర్లను వెంటాడుతున్నది. గతంలో పల్లా గెలుపు కోసం పార్టీ లీడర్లు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మళ్లీ ఉప ఎన్నిక వస్తే, పార్టీ గెలుపు అంత సులువు కాదని, గ్రాడ్యేయేట్స్ ప్రభుత్వం తీవ్ర కోపంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : హరీష్ రావుపై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలుంటాయా?

Tags:    

Similar News