కొలిక్కిరాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా.. ‘లోకల్’ ఫైట్ జరిగేది అప్పుడే..!

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను జూన్ చివరి వరకు కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. ఆ దిశగా ప్రాథమిక కసరత్తు ఇంకా ప్రారంభం కాలేదు.

Update: 2024-05-18 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను జూన్ చివరి వరకు కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. ఆ దిశగా ప్రాథమిక కసరత్తు ఇంకా ప్రారంభం కాలేదు. జూలై సెకండ్ వీక్‌లో అసెంబ్లీ సెషన్ జరగనున్నందున ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగానే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నుంచి షెడ్యూలు రిలీజ్ కావచ్చని టాక్. గ్రామాల్లోని స్పెషల్ ఆఫీసర్ల పాలన జూలై చివరతో ముగుస్తున్నది. కానీ, ఇప్పటికీ బీసీ రిజర్వేషన్లు ఖరారు కాలేదు. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి బీసీ కమిషన్ నోడల్ ఏజెన్సీ కావడంతో ఆ ప్రక్రియ చేపట్టడానికి కనీసంగా రెండు నెలల టైమ్ పడుతుంది.

ఖరారు కాని రిజర్వేషన్లు..

సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నది. పాత గణాంకాలకు బదులుగా సమకాలీన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యతను స్టేట్ బీసీ కమిషన్‌కు అప్పగించింది. దీంతో గ్రామ పంచాయతీలు, వార్డులవారీగా బీసీ జనాభాను (కులాలవారీగా) అధ్యయనం చేసి వారి వెనకబాటుతనానికి అనుగుణంగా రిజర్వేషన్ ఫార్ములాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి.

కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడి బడ్జెట్ రిలీజ్ అయితేనే ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో వార్డులవారీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చే చాన్స్ ఉన్నది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి వార్డులోనూ బీసీ ఓటర్ల లెక్కలు తేలాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోల సహకారంతో బీసీ ఓటర్ల సంఖ్య ఖరారు కావాలి. ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ ఓటర్ల గణాంకాలను సేకరించాల్సి ఉంటుంది.

ఓటర్ల డేటా కోరిన బీసీ కమిషన్

గడిచిన మూడు పంచాయతీల ఎన్నికల ఓటర్ల డేటాను ఇవ్వాల్సిందిగా బీసీ కమిషన్ ఇప్పటికే పంచాయతీరాజ్ డిపార్టుమెంటును కోరింది. వారి దగ్గర వివరాలు ఉన్నా బీసీ కమిషన్‌కు అవి అందలేదని తెలిసింది. ఓటర్ల లిస్టు ప్రకారం సర్వే నిర్వహించాల్సి ఉంటే పంచాయతీ వార్డులవారీగా జాబితా అవసరం. ఎన్నికల కమిషన్ దగ్గర పోలింగ్ బూత్‌లవారీ డాటా మాత్రమే ఉన్నందున వార్డులవారీ జాబితాను రూపొందించడం భారీ ప్రహసనంగా మారింది. 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినా అప్పటి లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తాజాగా వెనకబాటుతనాన్ని నిర్ధారించి ఆ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేయాలన్నది బీసీ కమిషన్ వాదన.

ఈ నెల 15న జరిగిన సమావేశంలోనూ బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపిన కమిషన్.. యాక్షన్ ప్లాన్‌పై డిస్కస్ చేసింది. ఇప్పటికే పలుమార్లు పంచాయతీరాజ్‌కు లేఖలు రాసినా అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో చీఫ్ సెక్రటరీకి సైతం విన్నవించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ సర్వే కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవాల్సి ఉన్నందున పటిష్టమైన కోఆర్డినేషన్ మెకానిజాన్ని రూపొందడం అవసరమని కమిషన్ భావిస్తున్నది. ఇందుకు సీఎస్‌‌ను రిక్వెస్టు చేస్తున్నది.

నిర్దిష్టంగా ఏ కులం సామాజిక, రాజకీయ వెనుకబాటుతనానికి గురైందో నిర్ధారించాలన్నది సుప్రీంకోర్టు నిబంధన. దీంతో కులాలవారీగా బీసీల డాటాను తయారు చేయడం అనివార్యమవుతున్నది. ఏ గ్రామంలో ఏ కులం జనాభా ఎక్కువగా ఉన్నదో తేలితే దానికి అనుగుణంగా రిజర్వేషన్‌పై స్పష్టత ఏర్పడుతుంది. గతంలో బీసీల్లోని ఏ కులానికి ఎక్కువసార్లు ప్రాధాన్యత లభించింది? ఏ కులం వారు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు? తదితర వివరాలన్నింటినీ అటు పంచాయతీరాజ్, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి బీసీ కమిషన్ కోరుతున్నది. ఆ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పర్సంటేజీని లెక్క కట్టాల్సి ఉంటుంది. మొత్తం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించకుండా అన్ని పంచాయతీలు, వార్డుల నుంచి వివరాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో ఫైనల్ చేయడం బీసీ కమిషన్ టాస్క్.

ఈ సారి మారనున్న రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకాలం ఉన్న బీసీ రిజర్వేషన్ల ఫార్ములా ఈసారి మారనున్నది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 2021 తర్వాతి పరిస్థితులను బేరీజు వేసుకుని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు వెంటనే సర్వే మొదలుపెట్టినా కనీసంగా రెండు నెలల సమయం పడుతుందన్నది బీసీ కమిషన్ వాదన. గత ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్లు ఈసారి మారే అవకాశమున్నది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికల కోసం అన్ని పార్టీల్లోని లోకల్ లీడర్లు రెడీ అవుతున్నారు. కార్యకర్తలు, అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ ఫైనల్ కాకపోవడంతో పాటు గత ఎన్నికల నాటి రిజర్వేషన్లు వర్తించకపోవడంతో కన్‌ఫ్యూజన్ నెలకొన్నది. జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచిన సందర్భాలు తక్కువ కావడంతో రిజర్వేషన్ ఇప్పుడు ఆశావహులకు కీలకంగా మారింది.


Similar News