TG Govt: లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం.. రేపే కొత్త నోటిఫికేషన్!
లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీల స్థానంలో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో/వికారాబాద్ ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో (Lagacharla) ఫార్మా పరిశ్రమలఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణ విషంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూసేకరణను ఉపసంహరించుకుంది. ఈ మేరకు లగచర్ల గ్రామంలో భూసేకరణను (Land Acquisition) ఉపసంహరించుకుంటున్నట్లు పబ్లిక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో ఫార్మా విలేజ్‌ల కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భూసేకరణ విషయంలో లగచర్లలో గ్రామ సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Pratik Jain) తో సహా పలువురు అధికారులపై స్థానిక రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వారికి ప్రతిపక్షాలుసైతం మద్దతు తెలుపుతున్నాయి. జరిగిన పరిణామాల దృష్ట్య ఫార్మా ఇండస్ట్రీ నిమిత్తం భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
త్వరలో మరో నోటిఫికేషన్:
లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసిన ప్రభుత్వం అక్కడే కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని, ఇందుకు అవసరమైన కొత్త నోటిఫికేషన్ (New Notification) ను రేపే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్ లో టెక్స్ టైల్ (Textile companies) కంపెనీలకు ప్రాధాన్యత ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పొల్యూషన్ ఉండదు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో లగచర్ల, హకీంపేట్ పోలేపల్లి గ్రామాల ప్రజలకు తీపికబురు కానున్నది.
అధికారిక సమాచారం రాలేదు: దుద్యాల తహశీల్దార్
ఫార్మా కంపెనీలకు భూసేకరణ నోటిఫికేషన్ ఉపసరణపై దుద్యాల మండలం తహశీల్దార్ (Tahsildar) ను దిశ వివరణ కోరింది. లగచర్ల గ్రామంలో భూసేకరణ ఉపసంహరణ పబ్లిక్ నోటిఫికేషన్ విడుదలైన మాట వాస్తవమేనని కానీ జిల్లా కలెక్టర్ నుంచి మాకు ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదని తెలిపారు. .