‘హైడ్రా’పై టీ.బీజేపీలో అయోమయం.. స్పష్టమైన విధానం చెప్పని నాయకత్వం

హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంలోకి రంగంలోకి దిగిన హైడ్రా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నది.

Update: 2024-08-29 01:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంలోకి రంగంలోకి దిగిన హైడ్రా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నది. దీనిని ఎక్కువ శాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజకీయ నేతలు సైతం పార్టీలకతీతంగా మద్దతు తెలుపుతున్నారు. కానీ బీజేపీలో మాత్రం ‘హైడ్రా’పై అయోమయం నెలకొంది. ఈ అంశంపై కాషాయ పార్టీ నేతలు తలోదారిలో వెళ్తున్నారు. కొందరు నేతలు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టమైన వైఖరిని చెప్పడం లేదు. గతంలో రుణమాఫీపైనా శ్రేణుల్లో ఇలాంటి సందిగ్ధతే నెలకొంది. తాజాగా హైడ్రాపైనా ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వారు తెలుపుతున్నారు.

సొంత ఒపీనియన్ కే ప్రయారిటీ..

కమలం పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఏదైనా ఇష్యూపై శ్రేణులకు గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన స్టేట్ యూనిట్.. ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్. రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా హైడ్రాపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏకాభిప్రాయం కుదరడం లేదనే చర్చ జరుగుతున్నది. ప్రత్యర్థి పార్టీలను చెక్ పెట్టే అంశాలున్న అస్త్రాలను వాడుకోవడంలో పార్టీ ఫెయిల్ అయిందనే టాక్ ఉంది. అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత అందకపోవడంతో సొంత ఒపీనియన్ కే శ్రేణులు ప్రయారిటీ ఇస్తున్నాయి. ఎవరి ఒపీనియన్ వారు చెబుతుండటంతో నేతల మధ్య సఖ్యత లేదన్న విమర్శలకు సైతం బలం చేకూరేలా ఉన్నది. ఇది పార్టీకి నష్టం కలిగించే అంశంగా మారింది. అయితే ఇందులో పలువురి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లుగా ఉండటం వల్ల నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు.

కొందు సపోర్ట్.. కొందరు వ్యతిరేకం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ హైడ్రా నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టారు. అడ్డగోలుగా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడాబాబుల కట్టడాలు కూల్చడం సంతోషమేనని, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. రేవంత్ హీరోలాగా ఫోజులు కొట్టే పద్దతి మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. ఈ నిర్మాణాలకు గతంలో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్సేననే విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు కూల్చివేతలను సమర్థించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సైతం మద్దతు పలికారు. కానీ ఒవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి హైడ్రా బడాబాబుల కట్టడాలు కూల్చివేస్తే ఇబ్బంది లేదని, సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పుకొచ్చారు. హైడ్రా లాంటి కీలక అంశాలపై కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం శ్రేణులను కలవరపెడుతున్నది.


Similar News