రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఒక క్రిమినల్ అని మండిపడ్డారు.

Update: 2024-02-10 14:32 GMT
రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్: కేటీఆర్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఒక క్రిమినల్ అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని, ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందే రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈనెల 13న ఛలో నల్లగొండ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కృష్ణా బేసిన్ లోని ఉమ్మడి జిల్లాల ప్రజలు, నాయకులంతా కదిలి రావాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన ఇంగిత జ్ఞానం లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లొచ్చు, చూసి నేర్చుకోవచ్చు అని సూచించారు. ప్రాజెక్టులో ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్‌లు ఉన్నాయనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చన్నారు.

మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ అని, కాళేశ్వరంలో వారికి ఓనమాలు కూడా తెలవదన్నారు. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా నిలుస్తున్నదని, దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలి.. ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందన్నారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అన్నారు. రాజకీయ దురుద్దేశంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు అపవాదుకి గురిచేసి భ్రష్టు పట్టించాలని చూస్తే అది కాంగ్రెస్ అమాయకత్వం అన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగితే బయటపెట్టండి, ఏ విచారణకైనా సిద్ధమని గతంలోని పదుల సార్లు చెప్పామన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంది.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు.. కేవలం బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డగోలుగా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.. అధికారం ఆయన చేతిలో ఉంది.. ఎవరిపైన అయినా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు అని అన్నారు.

Tags:    

Similar News