Kothagudem: దర్జాగా కబ్జా..! పాత కొత్తగూడెంలో అక్రమార్కుల ఆగడాలు

బంగారం రేటు కంటే ఇళ్ల స్థలాల విలువ రోజురోజుకు పెరిగిపోతోంది.

Update: 2024-08-02 04:51 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: బంగారం రేటు కంటే ఇళ్ల స్థలాల విలువ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొంతమంది కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 20 గజాల నుంచి మొదలుకుని ఎకరాలకు ఎకరాలు అక్రమించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడో ఒకచోట ఈ తంతు జరుగుతూనే ఉంది. అసలైన భూ యజమానులు తమ భూమిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు అక్రమార్కులు నయానోభయానో బెదిరించి అడ్డికి పావుసేరు లెక్కన భూములు కొనుగోలు చేస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పట్టణంలోని పాత కొత్తగూడెం ఇందిరమ్మ కాలనీలో రోడ్డును కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తమ ఇంటిని ఆనుకుని ఉంది కాబట్టి ఈ స్థలం తమదేనంటూ రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని స్థానికులను బెదిరిస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. పాత కొత్తగూడెం ఇందిరమ్మ కాలనీలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పంపిణీ చేసింది. లేఅవుట్ వేసి ప్రతీ ఒక్కరికీ 99 గజాల చొప్పున ఇండ్ల స్థలాలను అందించి వాటికి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అక్కడ అందరూ ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం బైపాస్ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. దీంతో ఇదే అదనుగా చేసుకున్న ఓ ఇంటి యజమాని 877 ప్లాట్ నెంబర్ పక్కన ఉన్న కాలనీ రోడ్డును అక్రమణకు తెరలేపాడు.

గత రెండు, మూడేళ్లుగా దారిని మూసి కంచెకట్టి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా ఆ కంచెను తిరిగి తొలగించారు. ఇక 824 ప్లాట్ నెంబర్ పక్కన గల స్థలాన్ని మరొకరు దారిని ఆక్రమించి చిన్న రేకుల షెడ్డును నిర్మించి ఇంటి నెంబర్ తీసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడి కబ్జాలో ఆ స్థలం ఉన్నట్లుగా తెలుస్తోంది. దారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టేందుకు చేస్తున్నా రెవెన్యూ అధికారులు విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కబ్జా ఉన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుని రహ‘దారిని’ చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News