‘ఇప్పుడు హ్యాపీ’.. కేసీఆర్ ఫ్యామిలీపై కేకే సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సీనియర్ రాజకీయ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు (కేకే) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-04 16:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సీనియర్ రాజకీయ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు (కేకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవారని (పరోక్షంగా కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉందన్నారు. ఇక, కాంగ్రెస్ నా సొంతిల్లు అని, నేను కాంగ్రెస్ మనిషినని అన్నారు. తిరిగి తన సొంతగూటికి చేరినందుకు ఇప్పుడు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించడంతో పాటు అధినేత కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న కేకే.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ గుర్తుపై ఎన్నికైన రాజ్య సభ ఎంపీ పదవికి ఇవాళ రాజీనామా చేశారు. అయితే, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం, పోచారం వంటి సీనియర్ నేతలు.. గులాబీ పార్టీపై కానీ కేసీఆర్ ఫ్యామిలీ గురించి కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు. వీరికి విరుద్ధంగా కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న కేకే మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీపై విమర్శలు చేయడం గమనార్హం.


Similar News