‘బజరంగ్ దల్’ బ్యాన్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రకు తెరతీసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-04 08:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రకు తెరతీసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన ఆయన నేరుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో బజరంగ్ దల్‌ను నిషేధించడంపై ఆయన స్పందించారు. బజరంగ్ దల్ అనేది బీజేపీకి అనుబంధ పార్టీ కాదని చెప్పారు. హిందువులపై కాంగ్రెస్ కుట్ర, అణచివేత, వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ రోజు బజరంగ్ దల్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ వందేమాతరం, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనే నినాదాలపైనా నిషేధం విధిస్తుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల తర్వాత హిందువులు గుళ్లకు కూడా వెళ్లొద్దనే దుర్మార్గపు ఆలోచన చేస్తారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

హిందూ వ్యతిరేక విధానం కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి ఉందన్నారు. రాజకీయ దృక్పథంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ విభజించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. మతపరమైన అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో ఎప్పుడూ పెట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కోర్టు, కాగ్ చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 9 ఏళ్లలో నరేంద్ర మోదీ దేశాన్ని ఎలా పాలించారో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో తీసుకొచ్చిన మతసామరస్యాన్ని ప్రజల ముందు ఉంచుతామని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News