ఆ కార్యక్రమానికి CM కేసీఆర్ వస్తారని అనుకుంటున్నా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివానం మీడియాతో మాట్లాడిన ఆయన.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను అందరికీ ఆహ్వానాలు పంపించిట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవానికి వస్తారనే భావిస్తున్నామని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇప్పటికే 5 ప్రారంభించామని.. రేపు ప్రారంభించబోయేది ఆరవ రైలని, దేశవ్యాప్తంగా మొత్తం వంద వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్డింగ్ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అయితే, రేపు ఒక్క రోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో అందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, సంక్రాంతి పండగ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు.