పేదలకే నిబంధనలు.. సంపన్నులకు అండదండలు

నిరుపేదలు చిన్నపాటి తప్పు చేస్తేనే హడావుడి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న వైరా మున్సిపాలిటీ అధికారులు సంపన్నులకు మాత్రం తమ అండ దండలను పుష్కలంగా అందిస్తున్నారు.

Update: 2023-05-10 03:39 GMT

దిశ, వైరా : నిరుపేదలు చిన్నపాటి తప్పు చేస్తేనే హడావుడి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న వైరా మున్సిపాలిటీ అధికారులు సంపన్నులకు మాత్రం తమ అండ దండలను పుష్కలంగా అందిస్తున్నారు. వైరా మున్సిపాలిటీలో సంపన్నులకు మాత్రం నిబంధనలు వర్తించవు. వైరా ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ పక్కనే మున్సిపాలిటీ రోడ్డుపై తన భవనంపై అంతస్తులకు వెళ్లేందుకు ఓ భవన యజమాని ఏకంగా మెట్లు నిర్మించి సంవత్సరకాలం గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వైరా ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ పై గతంలో అనుమతులు లేకుండా అక్రమ భవనాన్ని నిర్మించిన యజమాని మున్సిపాలిటీ రోడ్డుపై మెట్లు కూడా నిర్మించటం విశేషం. ఇంత జరుగుతున్నా మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇదంతా మాకు "మామూలే" అన్నట్లు వ్యవహరించటం వివాదాస్పదమవుతోంది.

నిబంధనలు వారికి వర్తించవేమో..!

వైరాలోని ఎస్బిహెచ్ టౌన్ బ్రాంచ్ పై నిర్మించిన 2,3వ అంతస్తులకు వెళ్లేందుకు అవసరమైన మెట్లను యజమాని మున్సిపాలిటీ రోడ్డుపై నిర్మించారు. గత సంవత్సరం కాలం క్రితం వైరాలోని జాతీయ రహదరికి కి ఇరువైపులా డ్రైనేజీ నిర్మించేందుకు అప్పట్లో ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపులో ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మెట్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సదరు భవన యజమాని మెట్లు నిర్మించేందుకు కనీస స్థలం లేదు. ఈ ఎస్ బి ఐ బ్యాంకు పై ఉన్న అంతస్తులను అద్దెలకు ఇచ్చారు. అయితే పై అంతస్తులు వెళ్లేందుకు మెట్లు నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో ఆ యజమాని మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించి ఇనుపమెట్లను నిర్మించారు.

సంవత్సర కాలంగా ఈ మెట్లు రోడ్డుపై ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులకు కనిపించకపోవడం విశేషం. వార్డ్ ఆఫీసర్లకు ఈ మెట్లు కనిపించకపోవడం శోచనీయం. రోడ్డుపై దర్జాగా మెట్లు నిర్మించిన ఇంటి యజమాని ఆ స్థలం తనదేనని తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోనేందుకు ప్రయత్నించడం విశేషం.ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు రోడ్డుపై నిర్మించిన మెట్లు తొలగిస్తారో...?లేదంటే ఇదంతా మాకు మామూలే అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News