కార్పొరేషన్ విధులను పకడ్బందీగా చేపట్టాలి

ఖమ్మం నగర పరిధిలో కార్పొరేషన్ విధులను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

Update: 2024-12-12 14:39 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగర పరిధిలో కార్పొరేషన్ విధులను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ఆయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ లో విలీనమైన పంచాయతీలలో కార్మికుల కొరత, తాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లు లేవని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ప్రతి డివిజన్ కు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లు తయారు చేసి అందులో సంబంధిత డివిజన్ ఇంజనీర్ అధికారులు, డివిజన్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు ఉండేలా చూడాలని అన్నారు.

    పారిశుధ్య సిబ్బంది కొరత ఉందని, అటెండెన్స్ తప్పుగా నమోదు అవుతుందని, నీటి లీకేజీ సమస్యలు వేగంగా పరిష్కారం కావడం లేదని అన్నారు. నగరంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి దరఖాస్తులు వెంటనే డిస్పోజ్ చేయాలని, అనర్హత ఉంటే వెంటనే ఆ దరఖాస్తుదారులకు తెలియజేయాలని అన్నారు. పార్కు, జంక్షన్ ల నిర్వహణ సరిగ్గా లేదని దీనిని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని అన్నారు. కుక్కల జనాభా నియంత్రణ ఆపరేషన్ లక్ష్యాలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ సంస్థల్లో కూడా మొక్కల పెంపకం పర్యవేక్షించాలని కోరారు. ప్రైవేట్ స్థలాల్లో ఫెన్సింగ్ వేసుకోవాలని, అక్కడ చెత్త చేరడానికి వీలు లేదన్నారు. రెండు, మూడు సార్లు నోటీసు ఇచ్చిన తరువాత కూడా యజమానుల నుంచి స్పందన రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ సంస్థల్లో ముందస్తుగా ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని, ప్రైవేట్ సంస్థల్లో కూడా నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. రాబోయే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని అన్నారు. స్లాటర్ హౌస్ కు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.

     మిషన్ భగీరథ ద్వారా బల్క్ నీటి సరఫరా అందించే ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థల వివరాలు అందించాలని అన్నారు. వర్షా కాలం వచ్చే లోపు నగరంలో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్లను ఆక్రమిస్తూ ర్యాంపుల నిర్మాణం జరుగుతుంటే సిబ్బంది సైలెంట్ గా ఉండటం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్స్, వైన్ షాపుల ముందు వాహనాల పార్కింగ్ విపరీతంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించాలని కోరారు. గంజాయి విక్రయాలు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు. రాబోయే వర్షాకాలం కంటే ముందు రాజమండ్రి రహదారి పూర్తి కావాలని, దీని కోసం ధంసలాపురం ఫ్లై ఓవర్ తో సహా పూర్తి కావాలని అన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది అటెండెన్స్ కు క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చర్యలు చేపట్టామని, ప్రతి వాహనాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కేటాయింపు ప్రతి డివిజన్ కు ఒకే విధానంలో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్నామని అన్నారు.

    నగరం కార్పొరేషన్ పరిధిలో జ్యూస్ షాపులు, హోటల్స్, నాన్ వెజ్ దుకాణాలు, ఫంక్షన్ హాల్స్ నుంచి వచ్చే చెత్త రోడ్డుపైన వేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ప్రతి డివిజన్ కు పారిశుద్ధ్య ప్రణాళిక తయారు చేశామని, ప్రతి డివిజన్ కు సంబంధించిన వాటర్ మ్యాన్, లైన్ మ్యాన్, పారిశుద్ధ్య సిబ్బంది వివరాలు సంబంధిత ప్రజలకు తెలిసే విధంగా గోడలపై రాశామని, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించామని చెప్పారు.

    ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కంట్రోల్ రూమ్ శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పోస్టాఫీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ జీవిత బీమా కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య సమస్యల నిమిత్తం 5 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి రోజూ 15 నుంచి 20 ఆపరేషన్లు చేస్తున్నామని, కోతులు, పందుల సమస్య పరిష్కారం కోసం సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News