గుట్ట చాటున గుట్టుగా మట్టి,గ్రావెల్ దందా.. ‘దిశ’ కథనాలతో వెలుగులోకి వచ్చిన అవినీతి
సాంబాయిగూడెం గుట్ట మీద జరుగుతున్న కొన్ని వందల కోట్ల
దిశ,మణుగూరు :సాంబాయిగూడెం గుట్ట మీద ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి,గ్రావెల్ దందా యథేచ్ఛగా జరుగుతోంది.పగలు,రాత్రి అనే తేడా లేకుండా జేసీబీ సహాయం తో పదుల కొద్దీ లారీలతో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. రెవెన్యూ,ఫారెస్ట్ కలిగిన భూముల్లో ఈ దందా గత కొన్ని నెలల నుంచి నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత దందా జరుగుతున్న సంబంధించిన రెవెన్యూ,ఫారెస్ట్, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన ఓ యాష్ ప్లాంట్ కాంట్రాక్టర్,మరో ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ గుట్ట చాటున మట్టి, గ్రావెల్ దందాకు తెరలేపి కొన్ని టన్నుల కొద్ది మట్టి,గ్రావెల్ ను యాష్ ప్లాంట్ కు తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా కాంట్రాక్టర్లు అధికారుల జేబులు తడిపి మట్టి,గ్రావెల్ దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ కాంట్రాక్టర్లు తరలిస్తున్న మట్టి,గ్రావెల్ విలువ కొన్ని కోట్లు ఖరీదు చేస్తుందని దిశ పత్రిక కథనాల ద్వారా బయటపడింది.పత్రికలో కధనాలు వస్తే ఆరోజు దందా ఆపి మరుసటి రోజు లారీలతో కుప్పలు పోసుకొని దందా చేయడం గమనార్హం.అంతేగాక యాష్ ప్లాంట్ పక్కన మట్టి, గ్రావెల్ కొన్ని వందల కుప్పలు పోసి బహిరంగానే దర్శనమిస్తున్నాయి.ఇంత జరుగుతున్న సంబంధించిన రెవెన్యూ,ఫారెస్ట్,మైనింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు అధికారుల చేతులు భారీగా తడపడం తో ఈ మట్టి, గ్రావెల్ దందా జోరుగా జరుగుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సాంబాయిగూడెం గుట్ట మీద జరుగుతున్న కొన్ని వందల కోట్ల మట్టి,గ్రావెల్ దందా దిశ కథనాలతో వెలుగులోకి వచ్చింది.అక్కడ జరుగుతున్న దందా అంచనా ప్రకారం 100 మీటర్ల భూమి చుట్టూ 120 ట్రిప్పులు మట్టి,గ్రావెల్ తోలుకోవచ్చు.అయితే ఒక్క లారీ ట్రిప్పుకు వచ్చేసి మట్టి,గ్రావెల్ సుమారు 35 టన్నుల వరకు పడుతోంది.ఈ లెక్కన 120×35 వేసుకున్న 4200 ట్రిప్పులు పడుతోంది.100 మీటర్లకు 120 ట్రిప్పులు పడితే 4కిలో మీటర్లకు 4000 వేల మీటర్లు వస్తుంది. 4000×35 వేసుకుంటే సుమారు లక్ష 40,000 టన్నులు వస్తుంది. 1,40,000×40 వేసుకుంటే సుమారు రూ.56 లక్షలు మట్టి,గ్రావెల్ వస్తుంది.సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వం ద్వారా రాయల్టీగా అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి సుమారు టన్నుకు 40 చొప్పున రాయల్టీ కట్టాలి.
కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రభుత్వానికి రాయల్టీ కూడా కట్టకుండానే మట్టి,గ్రావెల్ దందా దర్జాగా చేస్తూ కొన్ని కోట్లు కొల్లగొట్టారు.అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా తోలకాలు చేసినందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు సదరు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 4 వంతులైన ప్రభుత్వానికి రాయల్టీ కట్టించాలి.కానీ ఎటువంటి రాయల్టీ కూడా కాంట్రాక్టర్ల దెగ్గర నుంచి కట్టించడం లేదని ఈ దందా ద్వారా తెలుస్తోంది. అంటే ప్రభుత్వానికి దాదాపు రూ.రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల నష్టం దాకా వాటిల్లిందని అంచనా వేసిన లెక్కల ద్వారా తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడి అధికారులే కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి నష్టం చేకూర్చుతున్నట్లు ఈ దందా ద్వారా స్పష్టంగా కనబడుతుంది.
అసలు సాంబాయిగూడెంలో జరిగే దందా ఇదేనా..!
ఎలాంటి అనుమతులు లేకుండా సాంబాయిగూడెం గుట్ట మీద టన్నుల కొద్ది మట్టి,గ్రావెల్ దందా నడుస్తోంది.స్థానిక అధికారులు ఇచ్చిన వివరణల ప్రకారం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం కూడా గమనార్హమే.అంతేగాక జిల్లా అధికారులకు మట్టి,గ్రావెల్ తోలకాలకు అనుమతులు ఉన్నాయా అని ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరితే జిల్లా అధికారులు కూడా ఎలాంటి అనుమతులు లేవని ఇవ్వడం కూడా గమనార్హమే. అనుమతులు లేకుండానే గుట్ట మీద పగలు,రాత్రులు భారీ ఎత్తున కోట్ల అవినీతి దందా జరుగుతున్న రెవెన్యూ,ఫారెస్ట్, మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.కాంట్రాక్టర్లు అధికారుల చేతులు భారీగా తడపడంతోనే సాంబాయిగూడెం బొడ్డురాయి దేవత సాక్షిగా మట్టి,గ్రావెల్ దందా జోరుగా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ మట్టి,గ్రావెల్ దందాతోనే కాంట్రాక్టర్లు కొన్ని కోట్ల రుపాయలను కొల్లగొడుతున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ తోలకాలు చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోని,ప్రభుత్వానికి జరిగిన కోట్ల రూపాయల నష్టాన్ని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.