స్క్రాప్ గోల్మాల్ కథ కంచికేనా..?
వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, స్వచ్ఛ రిక్షాల గోల్ మాల్ కథ ఇక కంచికేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, స్వచ్ఛ రిక్షాల గోల్ మాల్ కథ ఇక కంచికేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, రిక్షాలు మాయమైనట్లు నెలరోజుల క్రితమే బహిర్గతమైనప్పటికీ కనీసం వాటి గురించి పట్టించుకున్న వారే కరువయ్యారు. ఈ స్క్రాప్ మాయం పై మున్సిపాలిటీ అధికారులు కనీసం పెదవి విప్పకుండా తమ మౌనమే సమాధానంగా చెబుతున్నారు. వైరా మున్సిపాలిటీలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం మున్సిపాలిటీ ఆఫీస్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ తో పాటు, ఆ పక్కనే ఉన్న మరో గోదామును కూల్చి వేశారు. ఈ గోదాములు సంబంధించిన స్క్రాప్ ఇనుముతో పాటు ఇతర సామాగ్రిని వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచారు. అదేవిధంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పట్టుపరిశ్రమ భవనాన్ని గతంలో కూల్చివేశారు. ఈ భవనానికి సంబంధించిన స్క్రాప్ ఇనుముతో పాటు ఇతర సామాగ్రి కనిపించడం లేదు.
సోమవారం (వైరా) గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు 20 స్వచ్ఛ రిక్షాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల రిక్షాలు వైరా మున్సిపాలిటీకి అప్పగించారు. అయితే ఈ స్వచ్ఛ రిక్షాలు మాయమయ్యాయి. టన్నుల కొద్దీ ఇనుముతో పాటు రిక్షాలు కనిపించకపోయినా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ హయాంలోనే ఈ గోల్ మాల్ జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి నేటి వరకు అధికారులు పోలీసులు కూడా ఫిర్యాదు చేయలేదు. లక్షలాది రూపాయల స్క్రాప్ ను మాయం చేసిన వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ స్క్రాఫ్ ను పాత ఇనుము దుకాణంలో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్క్రాప్ ను మాయం చేసిన వారిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని వైరా మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.