బీఆర్ఎస్ పాలకుల వల్లే విద్యార్థుల ఆరోగ్యం కరాబు
గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు పట్టించుకోకుండా, డైట్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
దిశ, బోనకల్ : గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు పట్టించుకోకుండా, డైట్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత పది సంవత్సరాలుగా గురుకుల, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం గురించి పట్టించుకోని గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్స్ బాగాలేవని, భోజనం సరిగా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. శనివారం మధిర నియోజకవర్గం బోనకల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలకులు గురుకుల, హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులను చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసినట్టు తెలిపారు. దాంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన కాంట్రాక్టర్లు ఆహార పదార్థాలను నాసిరకంగా సరఫరా చేయడంతో వాటిని తిన్న విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, ఆ విషయాలను మర్చిపోయి సోయి తప్పిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా డ్రామాలు చేయడం తమకు రాదన్నారు.
నాణ్యత లోపిస్తే ఉపేక్షించం
ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా మార్చిన కొత్త మెనూ ప్రకారమే విద్యార్థులకు డైట్ అందించాలని, అందులో నాణ్యత లోపిస్తే ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలలో కల్తీ అనే మాటే ఉండకూడదని, పరిశుభ్రత విషయంలో కూడా తేడా రాకుండా చూసుకోవలసిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. గురుకుల, ప్రభుత్వ వసతి గృహాలపై ప్రజా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదన్నారు. అధికారంలోకి ప్రజా ప్రభుత్వం రాగానే 11 వేల మంది ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా నియామకం చేసిందని, మరో 6 వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మరో డీఎస్సీని త్వరలో వేస్తామన్నారు.
56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉద్యోగాలతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రజా ప్రభుత్వం అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నదని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలకులు గురుకుల పాఠశాల నిర్వహణకు, భవన నిర్మాణాల కోసం కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించగా, ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పేదలకు అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు. మొదటి విడతలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. విద్యార్థులకే కాకుండా ఆసుపత్రిలో ఉన్న రోగులకు కూడా డైట్ చార్జీలను పెంచామని వెల్లడించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. కొత్త డైట్ మెనూను డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి కిషోర్ కుమార్, చేబ్రోలు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సుధీర్ బాబు పాల్గొన్నారు.