వెంచర్లకు ప్రభుత్వ భూముల నుంచి దర్జాగా మట్టి తరలింపు..

ముదిగొండ మండల కేంద్రంలో రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.

Update: 2023-05-31 06:26 GMT

ముదిగొండ మండల కేంద్రంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలం ఖమ్మం జిల్లాకు అతి చేరువగా ఉండటంతో ఇక్కడి గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనిపై కన్నేసిన కొందరు రియల్ వ్యాపారులు ఇక్కడ వెంచర్లను ఏర్పాటు చేశారు. ఇంత వరకు భాగానే ఉన్నా వెంచర్లకు కావాల్సిన మట్టిని ఎటువంటి అనుమతి లేకుండా రవాణా చేస్తున్నారని తెలుస్తున్నది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గుట్టలు, భూములపై పడి పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి రవాణా చేసి వెంచర్లను ముస్తాబు చేశారు. వెంచర్ వేసింది అధికార పార్టీ నాయకులు కావడంతో అటుగా ఎవరూ వెళ్లడం లేదని తెలుస్తున్నది. వెంచర్లకు వేల ట్రిప్పుల మట్టి ఎలా వచ్చిందంటూ అధికారులు ప్రశ్నించే సాహసం చేయడం లేదని సమాచారం.

దిశ, ముదిగొండ: ముదిగొండ మండల కేంద్రంలో రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ముదిగొండ.. ఖమ్మానికి అతి చేరువగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రియల్ వ్యాపారుల భారీ వెంచర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్ల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా వాటికి కావాల్సిన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ భూములు, గుట్టలపై పడి రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వెంచర్లు వ్యవసాయ భూముల్లోనే ఉన్నాయి.

ఇక్కడి నేలలు ప్రధానంగా నల్లమట్టి, బురద మట్టి నేలలు కావడంతో ఈ భూముల్లో నిర్మాణాలు చేపడితే కొంతకాలానికే కుంగిపోయే ప్రమాదం ఉంది. దీంతో నాలుగైదు అడుగుల మేర మట్టిని తవ్వి కంకర, గలసతో నింపి భూమట్టం కంటే ఎత్తుగా చదును చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక వెంచర్‌కు వందల నుంచి వేల ట్రిప్పుల వరకు మట్టి అవసరం పడుతుంది. మట్టి కావాల్సినవారు మైనింగ్, రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తీసుకొని దానికి కొంత రుసుము చెల్లించి ఆ తర్వాతే మట్టితో తీసుకురాల్సి ఉంటుంది.

ముదిగొండ చుట్టుపక్కల గ్రామాల్లో గుట్టలు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో గ్రావెల్‌కు లోటు లేకుండా పోయింది. రియల్ వెంచర్ల యజమానులు అధికార పార్టీ నాయకులు అవడంతో దర్జాగా వేలాది టిప్పుల మట్టిని వీలైతే పగలు, లేకుంటే రాత్రి దర్జాగా ట్రాక్టర్లు, హెవీ వెహికల్స్‌తో మట్టిని తరలిస్తున్నారు. మండలంలో ప్రధానంగా నాలుగు వెంచర్లు ఉండగా వీటన్నింటినీ మట్టి నింపి సర్వాంగ సుందరంగా చదును చేసి ప్లాట్లు చేశారు. ఇంత పెద్దఎత్తునా మట్టి వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ఒకవేళ మట్టి తరలింపుపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. ఇప్పటికైనా స్పందించి అక్రమంగా మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News