చెరువులో బడిబాట..
కూసుమంచి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది అత్యధిక విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు టీంలుగా ఏర్పడి మండలం మొత్తం కలియతిరుగుతున్నారు.
దిశ, కూసుమంచి : కూసుమంచి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది అత్యధిక విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు టీంలుగా ఏర్పడి మండలం మొత్తం కలియతిరుగుతున్నారు. ఉదయాన్నే గ్రామాల్లోకి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్తుండటంతో కలవడం లేదు. దీంతో బుధవారం దుబ్బతండా శివారులో చెరువు వద్ద ఉపాధి పనుల చేస్తుండగా అక్కడే బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రేల విక్రమ్ రెడ్డి ప్రభుత్వం కల్పించే వసతులను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమం, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మధ్యాహ్నభోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ‘మన ఊరు-మన బడి’ పథకం ద్వార మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి డిజిటల్ విద్యాబోధన ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరుగురిని చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సీఆర్పీలు వడ్లమూడి వెంకటేశ్వర్లు, షేక్ జాఫర్ పాల్గొన్నారు.