సాయి తేజ మృతదేహాన్ని త్వరగా రప్పిస్తాం

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సాయి తేజ మరణించిన విషయం తెలిసిందే.

Update: 2024-11-30 11:19 GMT

దిశ, ఖమ్మం రూరల్ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సాయి తేజ మరణించిన విషయం తెలిసిందే. కాగా మృతుడి కుటుంబ సభ్యులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఫోన్​లో పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు నూకారపు సాయి తేజ భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున దుండగుల కాల్పుల్లో మృతి చెందిన దుర్ఘటన తెలుసుకొని తీవ్ర సంతాపం ప్రకటించారు.

    నగరంలోని రాపర్తి నగర్ లో నివాసం ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ద్వారా ఫోన్లో విద్యార్థి తండ్రి నూకారపు కోటేశ్వర రావు తో ఎంపీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎంఎస్ చదివేందుకు నాలుగు నెలల కిందటే అమెరికా వెళ్లాడని, ఇప్పుడు ఇంతటి ఘోరం జరిగిందని ఆయన కన్నీరు మున్నీరవగా ధైర్యంగా ఉండాలంటూ ఎంపీ ఓదార్చారు. మృతుడి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికాలో ఉన్న సాయి తేజ మృతదేహాన్ని మన దేశానికి త్వరగా రప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అభయమిచ్చారు. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. 


Similar News