కేసీఆర్కు సవాల్ చేసి.. శపథం నెరవేర్చుకున్న పొంగులేటి..!
పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో
దిశ బ్యూరో, ఖమ్మం: పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడం.. సొంత పార్టీలోనే అణిచివేతకు గురికావడంతో అసహనంగా ఉన్న ఆయన ఎన్నో రాజకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ‘ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను’ అంటూ ఆయన చేసిన శపథం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది. అయితే ఆయన అన్నట్టుగానే ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాల్లో సీపీఐతో పాటు మొత్తం 9 కాంగ్రెస్ స్థానాలను గెలిపించుకోవడంలో కీలక భూమిక పోషించారు. భద్రాచలంలో పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి గెలుపొందడం గమనార్హం.
ఆ ఇద్దరినీ ఓడించాలని..
అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పొంగులేటిని కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీలోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. చివరకు పొంగులేటి ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మల విమర్శలు.. పొంగులేటి సవాల్ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం జిల్లాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇద్దరినీ ఎలాగైనా ఓడించాలని చూసినా చివరకు వృథా ప్రయాసే అయింది. పొంగులేటి తన నియోజకవర్గం పాలేరులో తన బంధుమిత్రులతో ప్రచారం చేయిస్తూనే తాను మాత్రం ఎక్కువగా మిగతా నియోజకవర్గాల్లోనే ప్రచారం చేశారు. మిగతా నియోజకవర్గాల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిచి విజయం సాధించారు.
పువ్వాడపైనే ఎక్కువ ఫోకస్..
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ పైనే పొంగులేటి ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అజయ్ మంత్రిగా తన ఆధిపత్యాన్ని పొంగులేటిపై చూపారని, ఒకే పార్టీలో ఉండి కూడా తనకు ప్రాధాన్యం దక్కకుండా చేశారనే కసి పొంగులేటితోపాటు ఆయన అనుచరుల్లో మొదటి నుంచీ ఉంది. అజయ్ కూడా పొంగులేటి ఓటమిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగింది. ఈ క్రమంలో పొంగులేటికి తుమ్మల నాగేశ్వరరావు సైతం తోడవడంతో పువ్వాడ అవినీతి, ఆయన అనుచరుల అక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు.
మూడు పర్యాయాలు కారు పార్టీకి ఒక్కటే..
స్టేట్ పాలిటిక్స్ లో ఖమ్మం జిల్లాది విలక్షణ రాజకీయం. అయితే ఇక్కడ కారు పార్టీకి ప్రతిసారి ఒక్క సీటు రావడం గమనార్హం. 2014లో వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం అభ్యర్థిగా పోటీచేసిన జలగం గెలుపొందగా, 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఒక్కడే గెలుపొందడం విశేషం. అయితే ఈ రెండుసార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఒక్కడే గెలుపొందాడు. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈసారి గెలుపొందిన ఆ ఒక్క అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కారు పార్టీకి ఉన్న ఆ ‘ఒక్క’ సెంటిమెంట్ ను కూడా పొంగులేటి తిరగరాసినట్లవుతుంది.