కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయా.. ఆ యూనియన్ గెలిస్తే కార్మికుల కష్టాలు తీరుతాయి : మంత్రి పొంగులేటి
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కేసీఆర్ మాటలను నమ్మి నేను మోసపోయాను అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం పీవీకే-5 ఇంక్లైన్ ఏరియాలో ఐఎన్‌టీయూసీ తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి నటరాజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో అనేక కార్మిక సంఘాల నుండి ఐఎన్‌టీయూసీ యూనియన్‌లో చేరిన కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి తాను మోసపోయానని, తనతోపాటు నమ్మిన కార్మికులు సైతం మోసపోవడంమేకాక కార్మికుల కష్టాలు విన్నవించుకునే సందర్భం కూడా మనకు దొరక లేదన్నారు.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సింగరేణి 12 ఏరియాల్లో 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగిందని అన్నారు. ఏఐటీయూసీ యూనియన్‌కు చెందిన నాయకుని మొన్ననే మనం కొత్తగూడెం నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగిందని.. కానీ వారు మాత్రం సింగరేణి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామంటూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కార్మికుల సొంతింటి కల కోసం 250 గజాల ఇళ్ల స్థలం, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 23 తేదీకి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు సెలవు దినం ప్రకటిస్తామని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్‌కి కార్మికులు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 2017 ఎన్నికల అప్పుడు సింగరేణిలో సుమారు 60 వేల మంది కార్మికులు ఉండేవారని.. ప్రస్తుతం 39 వేల మంది కార్మికులు మాత్రమే ఉన్నారని కేసీఆర్ ప్రభుత్వం సుమారు 14,000 మంది కార్మికులను తొలగించడం జరిగిందని మండిపడ్డారు. డిసెంబర్ 27 వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ సంఘాన్ని గెలిపించాలని కోరారు.