వామ్మో విషజ్వరాలు.. పినపాకలో వణుకుతున్న గిరిజనులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఏప్రైవేట్ ఆస్పత్రి చూసినా విషజ్వరాలతో బాధపడుతూ చేరిన పేషెంట్లే కనిపిస్తున్నారు. ప్రతి కుటుంబంలో

Update: 2023-08-18 03:26 GMT

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఏప్రైవేట్ ఆస్పత్రి చూసినా విషజ్వరాలతో బాధపడుతూ చేరిన పేషెంట్లే కనిపిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఒక్కరిద్దరు జ్వరాలతో బాధపడుతూ మంచం పడుతున్నారు. తట్టుకోలేక మరణించిన ఘటనలూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విలయతాండవం చేస్తున్నట్లు తెలుస్తున్నది. వీటిని ఎదుర్కోలేక ఏజెన్సీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేయడానికి ఓపిక లేక, తినడానికి తిండి లేక ధైన్యంగా గడుపుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ విషజ్వరాలను అడ్డం పెట్టుకొని మండలంలోని కొన్ని ప్రవేట్ ఆస్పత్రుల వారు ఎడాపెడా దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైద్యాధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి

పినపాక నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ఈ విషజ్వరాలను అడ్డం పెట్టుకొని కొన్ని ప్రవేట్ ఆస్పత్రులు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. టెస్టుల పేరుతో ప్రవేట్ డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్తే అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలని, ఓపీల పేరుతో రాబంధుల్లా పిక్కుతింటున్నరని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కరోనా తర్వాత ఎంతో కొంత కోలుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బతుకే భారంగా ఉంటే ప్రవేట్ ఆస్పతుల వారు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడు ప్రవేట్ ఆస్పత్రి వైపు చూసే పరిస్థితి లేకుండా పోయిందని ధ్వజమెత్తుతున్నారు.

ఇకపోతే ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రజలను పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామాల ప్రజల ఆరోగ్యలను గాలికి వదిలేశారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం, మందులు ఇవ్వకపోవడంతో మండలంలో ఎంతో మంది విషజ్వరాలతో చనిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి మండలంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, టెస్టులు చేస్తే ఇంత పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ వైద్యులు ప్రజల ఆరోగ్యాలను పట్టించువడం లేదని తెలుస్తున్నది. జిల్లా వైద్య ఉన్నతాధికారులు వెంటనే నియోజకవర్గన్ని సందర్శించి ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న అరచక దందాను అరికట్టాలని అన్ని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.


Similar News