Palwancha : 28 ఏళ్లుగా ఎదురు చూపులు.. ఈసారైనా ఎన్నికలు జరిగేనా..?

తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Update: 2024-08-12 11:39 GMT
Palwancha : 28 ఏళ్లుగా ఎదురు చూపులు..  ఈసారైనా ఎన్నికలు జరిగేనా..?
  • whatsapp icon

దిశ, పాల్వంచ : తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. అదేవిధంగా జిల్లాలోని జంట మున్సిపాలిటీలుగా పాల్వంచ, కొత్తగూడెం కి ఒక ప్రత్యేకత ఉంది. జంట మున్సిపాలిటీలు లోని కొత్తగూడెం, పాల్వంచలలో కొత్తగూడెం మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అదే పాల్వంచ మున్సిపాలిటీకి మాత్రం ఎన్నికలు నిర్వహించడంలో అవంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో పంచాయతీ గా గుర్తింపు ఉన్న పాల్వంచ ప్రాంతం పాల్వంచ మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా 1987లో మొదటిసారి ఎలక్షన్స్ జరిగాయి.

1987 ఎన్నికల తీరు ఇలా..

1987లో 24 వార్డులతో పాల్వంచ మున్సిపాలిటీ ఉన్నది. 24 వార్డుల్లో 60 వేలకు పైగా ఓటర్లు ఉండేవారు. 1987 లో జరిగిన ఎన్నికల్లో కొమరం రాములు ప్రత్యర్థి పార్టీలపై టిడిపి సిపిఐ లపై పాల్వంచ మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కోసం 60 వేలకు పైగా ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారు. 1992లో పాల్వంచ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బన్సీలాల్ పోటీ చేసి చైర్మన్గా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రత్యర్థులైన టిడిపి సిపిఐ అభ్యర్థులపై పోటీ చేసి గెలవడం విశేషం. 1987 నుండి 1992 వరకు జరిగిన ఈ ఎన్నికల్లో పాల్వంచ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1992 తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కి బ్రేకులు పడ్డాయి. అప్పటినుండి 28 ఏళ్ల పాటు మున్సిపల్ ఎన్నికల కోసం పాల్వంచ ప్రజలు ఎదురుచూడడం తప్పడం లేదు. గతంలో 24 వార్డులు ఉన్న పాల్వంచ మున్సిపాలిటీలో ప్రస్తుతం 36 వార్డులుగా విభజన చేయాలని ప్రజల్లో ఒక డిమాండ్ నెలకొంది. పాల్వంచ మున్సిపాలిటీని 36 వార్డులుగా విభజించి మున్సిపల్ ఎలక్షన్లు పెడితే పాల్వంచ పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు ఎక్కువగా చొరవ చూపాలని పాల్వంచ ప్రజలు కోరుతున్నారు.

మాట తప్పిన ప్రజా ప్రతినిధులు..

తమ(వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు)లు తమను గెలిపిస్తే పాల్వంచ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అప్పుడు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వచ్చిన ప్రతిసారి మమ్మల్ని గెలిపించండి పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తాం అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని హామీలు గుప్పించారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో వేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పాల్వంచ మున్సిపాలిటీకి ఎలక్షన్లు నిర్వహించాలని పాల్వంచ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు మున్సిపల్ ఎన్నికల జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 28 ఏళ్లుగా ఎలక్షన్స్ కోసం ఎదురుచూస్తున్న పాల్వంచ ప్రజలకు ఈసారైనా ఓటు వేసే అవకాశం వస్తుందేమో వేచి చూడాలి.

పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలి : పాల్వంచ నివాసి ఆరుద్ర సత్యనారాయణ

పాల్వంచ కొత్తగూడెంకి జంట మున్సిపాలిటీలుగా పేరుంది. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఏర్పడి మున్సిపల్ చైర్మన్ హోదాలో కొత్తగూడెంలో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తుంన్నాయి. అదే సమయంలో పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోక మున్సిపల్ కార్యాలయం 28 ఏళ్లుగా అలంకారప్రాయంగా ప్రాయంగా మిగిలింది. 28 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించి పాల్వంచను అభివృద్ధి పథంలో నడపాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నాను.


Similar News