ఒరేయజా హార్వెస్టరా.... మజాకా
అది ఓ చైనా హార్వెస్టర్.... ఆ హార్వెస్టర్ కు అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్ అనుమతులు లేవు.
దిశ, వైరా : అది ఓ చైనా హార్వెస్టర్.... ఆ హార్వెస్టర్ కు అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్ అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఆ చైనా ట్రాక్ హార్వెస్టర్ ను విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏదైనా ఒక హార్వెస్టర్ ను మార్కెట్లోకి తీసుకురావాలంటే భారత ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. అయితే ఆ నిబంధనలను గాలికి వదిలేస్తూ చైనా నుంచి అతి చౌకగా హార్వెస్టర్లను తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా ఈ హార్వెస్టర్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ హార్వెస్టర్ ను కొనుగోలు చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన రైతు లబోదిబోమంటున్నారు. ఇది విజయవాడ కేంద్రంగా విక్రయిస్తున్న ఒరేయజా హార్వెస్టర్ బాగోతం. నిబంధనల ప్రకారం హార్వెస్టర్ ను మార్కెట్లో విక్రయించాలంటే తప్పనిసరిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుదిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ నేషనల్ టెస్టింగ్ సెంటర్ నుంచి టెస్ట్ రిపోర్ట్ అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలి.
అంతేకాకుండా హార్వెస్టర్ బండికి సంబంధించిన అన్ని విడిభాగాల కొలతలు ఈ టెస్టింగ్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్ సెంటర్లో కోత కోసిన తర్వాత ఆ హార్వెస్టర్ లో లోపాలను టెస్టింగ్ సెంటర్ వారు పరిశీలించి పలు సవరణలకు ఆదేశిస్తారు. ఈ టెస్టింగ్ రిపోర్టర్ అప్రూవల్ ఉంటేనే ఆర్బిఐ రూల్ ప్రకారం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ కల్పిస్తాయి. అంతేకాకుండా సదరు హార్వెస్టర్ కోసిన పంట క్వింటాకు ఎంత ధాన్యం లాస్ అవుతుందో అనే సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇన్వాయిస్ రేట్ కి హార్వెస్టర్ ను విక్రయించాల్సి ఉంటుంది. ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. అయితే పైన తెలిపిన ఎలాంటి అనుమతులు లేకుండా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ డీలర్ బుకింగ్ చేస్తున్నారు.
ఈనెల 4వ తేదీన కల్లూరు మండలంలోని పాయపూర్ గ్రామానికి చెందిన భూక్యా సురేష్ కు విజయవాడ కేంద్రంగా అనుమతులు లేని చైనా హార్వెస్టర్ ను విక్రయించారు. అయితే హార్వెస్టర్ లో పలు సమస్యలు వచ్చినప్పటికీ కనీసం సర్వీస్ సౌకర్యం కూడా ఇవ్వటం లేదని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం హార్వెస్టర్ కు సర్వీసింగ్ సెంటర్ లేకుండా విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇన్వాయిస్ రేటు రూ.21 లక్షలు ఉండగా రూ.23 లక్షలకు తనకు హార్వెస్టర్ ను విక్రయించారని సురేష్ తెలిపారు.
స్పేర్ పార్ట్స్ లేకుండా హార్వెస్టర్ విక్రయాలు....
ఏదైనా హార్వెస్టర్ ను మార్కెట్లోకి తీసుకురావాలంటే ముందుగా ఆ హార్వెస్టర్ కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ను అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి స్పేర్ పార్ట్స్ నేటి వరకు లేకుండా నేరుగా ఒరేయజా హార్వెస్టర్లను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. దీంతో ఈ హార్వెస్టర్ ను కొనుగోలు చేసిన వారు స్పేర్ పార్ట్స్ లభించక ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సర్వీసింగ్ సెంటర్స్ స్పేర్ పార్ట్స్ లేకుండా ఈ హర్వెస్టర్లను ఎలా విక్రయిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ హార్వెస్టర్ కు మరమ్మతులు వస్తే స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. కనీసం ముందస్తు చర్యలు లేకుండా హార్వెస్టర్లను విక్రయించటం పట్ల తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి.
నన్ను తీవ్రంగా మోసం చేశారు : భూక్యా సురేష్, రైతు
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అప్రూవల్ లేని ఒరేయజా హార్వెస్టర్ ను నాకు విక్రయించి తీవ్రంగా మోసం చేశారు. నేను గామ్ మిషన్ కోసం విజయవాడలోని ఎస్ఆర్ ఆగ్రోస్ డీలర్ జనార్దన్ రావుకు 50 వేల రూపాయలు అక్టోబర్ 15వ తేదీన చెల్లించా. అయితే నాకు గామ్ హార్వెస్టర్ ఇవ్వకుండా 45 రోజులు ఇబ్బంది పెట్టారు. అనంతరం మాయ మాటలు చెప్పి ఈనెల 4వ తేదీన ఒరేయజా హార్వెస్టర్ ను 23 లక్షల రూపాయలకు విక్రయించారు.
ఇన్వాయిస్ బిల్లు రూ. 21 లక్షలకు మాత్రమే ఇచ్చారు. నాకు ఈ హార్వెస్టర్ కు అగ్రికల్చర్ అప్రూవల్ లేదనే విషయం కూడా తెలియదు. హార్వెస్టర్ లో అనేక సమస్యలు వస్తున్నప్పటికీ కనీసం డీలర్ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా సమస్యల గురించి ప్రశ్నిస్తే గిరిజనడైన నన్ను డీలర్ దూషిస్తున్నారు. నేను చట్టరీత్యా అతనిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆశ్రయిస్తా.
అగ్రికల్చర్ అప్రోల్ అవసరం లేదు : జనార్దన్ రావు, ఒరేయజా డీలర్
ఒరేయజా చైన్ హార్వెస్టర్ కు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బుదిని అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్ అప్రూవల్ అవసరం లేదు. ఒరేయజా మాదిరిగానే మార్కెట్లోకి డెల్టా చైనా హార్వెస్టర్ తో పాటు మహేంద్ర కంపెనీకి చెందిన మరో చైనా హార్వెస్టర్ విడుదలైంది. ఆ హార్వెస్టర్లు కూడా అగ్రికల్చర్ అప్రూల్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తేనే ఈ అప్రూల్ అవసరం ఉంటుంది. నన్ను ఉద్దేశపూర్వకంగానే కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేష్ కు మా కంపెనీ సర్వీసింగ్ సౌకర్యం కల్పిస్తుంది.