దిశ, ఖమ్మం రూరల్ : అడిగేవాడు లేకపోతే.. అక్రమాలు చేసేందుకు అడ్డం ఏడీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుండటంతో.. అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. రైతుబంధు సాధారణంగా వ్యవసాయ భూమికే ఇవ్వాలనే రూల్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా క్రషర్ కు కూడా ఇవ్వడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మంరూరల్ మండలం పోలేపల్లి పరిధిలో ‘భద్రాద్రి రాక్స్ మినరల్‘ పేరిట సుడా (స్థంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకున్నారు. సుడా అధికారులకు తెలిపిన విధంగా సర్వే నెం.178/అలో 4 ఎకరాలు, 199/ఆలో 1:19 కుంటల భూమి ఉంది. రెండు సర్వే నెంబర్లలో మొత్తం 5.19 కుంటల భూమి తమ ఆధీనంలో ఉందని, వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చామని, ఈ భూమిలో క్రషర్ నిర్మాణానికి అనుమతులు కావాలంటూ టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకున్నారు. అయితే నిర్వహకులు మాత్రం మొత్తం భూమిని కన్వర్షన్ చేయకుండా కేవలం 1.19కుంటల భూమిని మాత్రమే కన్వర్షన్ చేసి మిగతా 4ఎకరాల భూమిని కన్వర్షన్ చేయకుండానే క్రషర్ నిర్వహణకు వాడుకుంటున్నారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుకు ఎగనామం..
రెండు సర్వే నంబర్లలో ఉన్న మొత్తం 5.19ఎకరాల భూమిలో కేవలం ఎకరా 19 కుంటల భూమికి మాత్రమే కన్వర్షన్ తీసుకుని, మొత్తం భూమికి కన్వర్షన్ తీసుకున్నామని తప్పుడు పత్రాలు పెట్టి టీఎస్ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులను బురిడీ కొట్టించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుకు ఎగనామం పెట్టారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టి క్రషర్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
రికార్డుల్లో రైతుబంధు..
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ రైతుబంధు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటపొలాలకు రైతుబంధు అమలు చేసిన గత ప్రభుత్వంలో.. ఇక్కడి క్రషర్ నిర్వాహకుల ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాలకు కూడా రైతుబంధు అందుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. రైతుబంధు అమలవుతున్నప్పటి నుంచి నాలుగు ఎకరాలకు ప్రతీఏటా రెండు దఫాలుగా జమ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పరిశ్రమల అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈ వ్యవహారంపై ఏమీ తెలియనట్లు ఉండటం విశేషం.
పట్టించుకోని పరిశ్రమలశాఖ..
పోలేపల్లి పరిధిలో ఏర్పాటు చేసిన క్రషర్ పరిశ్రమలశాఖ నుంచి అనుమతి తీసుకునట్లు తెలిసింది. పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకుంటే సబ్సిడీ కూడ పొందేందుకు వీరు అర్హులు. పరిశ్రమల శాఖ పర్యవేక్షణ లేకుండా ధ్రువపత్రాలు పరిశీలన చేయకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి చూడకుండా ఎలా అనుమతులిచ్చారన్నది అంతుచిక్కడం లేదు. అంతేకాదు ఈ క్రషర్ నిర్వహకులు తప్పుడు పత్రాలు పెట్టి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందినట్లు సమాచారం. కాగితాల్లో మాత్రమే చూపించి కోట్ల రూపాయల లోన్ తీసుకున్నట్లు తెలిసింది. ఒకవైపు బ్యాంకుల నుంచి రుణాలు, మరోవైపు ప్రభుత్వం అందించే రైతుబంధు, ఇంకోవైపు పరిశ్రమల శాఖ ఇచ్చే సబ్సిడీ మాత్రం పొందారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు మాత్రం చెల్లించకపోవడం విశేషం.
అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి
మునగాల లాలాబాబు, సీపీఎం నాయకుడు
అక్రమ క్రషర్నిర్వహణ, నిర్వహకులపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. నిబంధనల పాటించకుండా క్రషర్నడుపుతున్నారు. దుమ్మదూళి రాకుండా రోడ్డుపై వాటరింగ్ చేయడం లేదు. రాయల్టీ వంటి వాటికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలి.