అధికార పక్షానికి సహకరిస్తాం.. తాత మధు
ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, అధికార పక్షానికి పూర్తిగా సహకరిస్తామని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ అన్నారు.
దిశ బ్యూరో, ఖమ్మం : ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, అధికార పక్షానికి పూర్తిగా సహకరిస్తామని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 రోజులుగా ఎన్నికల్లో అవిశ్రాంతంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు చెప్పారు. ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కు లభించాయన్న ఆయన.. నూతనంగా ఎన్నికైన వివిధ పార్టీల శాసనసభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారని, వారి నిర్ణయాన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తున్నామని, కేసీఆర్ అడుగుజాడల్లో హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు.
తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని 9 ఏండ్లలో దార్శనికునిగా కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ కొనసాగించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. 9 ఏండ్ల కాలంలో జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధికి పెద్దపీట వేశారని రాబోయే ప్రభుత్వం సైతం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నాయకులందరం ప్రజలతోనే ఉంటామని, వారి సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు తదితరులున్నారు.