ఇష్టాను రీతిలో ప్రభుత్వ హాస్టల్ నిర్వాహణ.. ఒకే గదిలో 60 మంది.. హాస్టల్ వార్డెన్ కహానీలు..!

Update: 2024-09-26 15:36 GMT

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం: ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంగా నడుస్తున్న బీసీ బాలుర వసతి గృహంలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థులు హాస్టల్ లో ఉంటూ, విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలో బీసీ వసతి గృహ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్డింగ్ కు ప్రతినెల ప్రభుత్వం ఖజానా నుంచి రూ.12,500ల అద్దె చెల్లిస్తున్నారు.

అయితే.. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. 60 మంది విద్యార్థులు ఒకే గదిలో బస చేస్తున్నారని, ఉన్న ఒక్కగదికి కనీసం కిటికీలు, డోర్లు కూడా లేవని, దోమలు కుట్టడం వల్ల జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

అదే గదిలో విద్యార్థుల ఇనుప ట్రంకు పెట్టెలు, ఇతర వస్తువులు పెట్టుకుంటున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో గది చాలా ఇరుకుగా ఉందని, 60మంది విద్యార్థులకు కలిపి రెండే బాత్రూంలు, రెండు స్నానాల గదులు ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనివల్ల కనీస మరుగుదొడ్లు లేక, ఆరు బయటకు పోవాల్సి వస్తుందని విద్యార్థులు తమ బాధను చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఆహారాన్ని అందించే వంటగది సరిగా లేదని, ఇక్కడ విధులు నిర్వహించే హాస్టల్ వార్డెన్, ఇక్కడ ఎఫ్ఎసి వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

విచిత్రంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్..

బాలుర వసతి గృహంలో కామాటి, కుక్కు, నైట్ వాచ్ మెన్ తో పాటుగా ప్రధానంగా వార్డెన్ హాస్టల్ లో విధులు నిర్వహిస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ ను హాస్టల్ వార్డెనే నియమించుకొని, తన విధులను కూడా ప్రైవేటు వ్యక్తితోనే చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు ఉండే హాస్టల్ వసతి గృహంలోనే ఆ ప్రైవేట్ వ్యక్తి ఉంటూ.. వార్డెన్ నుండి జీతం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా కొన్ని నెలల నుంచి హాస్టల్లో ప్రైవేటు వ్యక్తులు ఉంటున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఇలా ప్రైవేటు వ్యక్తులు హాస్టల్ లో ఉండడంవల్ల ప్రభుత్వం నుంచి వచ్చే కీలక సూచనలు, జీవోలు, శాఖ విషయాలు బయటకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారి మాటల్లో....

కారేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఎటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ను ప్రభుత్వం నియమించలేదు. వార్డెన్ నే సొంతంగా ఓ వ్యక్తిని ట్యూటర్ గా నియమించుకున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. ప్రైవేటు వ్యక్తులను ట్యూటర్ గా నియమించుకున్న వార్డెన్ పై చర్యలు తీసుకుంటాం. - యం.ఈదయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఖమ్మం.


Similar News